ప్రజాపక్షం/క్రీడావిభాగం : ప్రతిష్టాతక క్రికెట్ ప్రపంచకప్ మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ మరోసారి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. తొలి ప్రపంచకప్ పోటీలు కూడా ఇంగ్లాండ్ వేదికగానే జరిగాయి. వరల్డ్‌కప్ సమరం కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. 1975లో ప్రపంచకప్ తొలి ఎడిషన్ ఆరంభమైంది. అప్పటి నుంచి 2015లో జరిగిన చివరి ప్రపంచకప్ వరకు మొత్తం 11ఎడిషన్‌లు పూర్తయ్యాయి. అయితే ఈ 11 ఎడిషన్‌లలో కొన్ని జట్లు అద్భుతంగా రాణించి మంచి ఫలితాలు సాధిస్తే.. మరికొన్ని జట్లు తేలిపోయాయి. ప్రపంచకప్‌లలో కొన్ని జట్లు ఎన్నో రికార్డులు తిరగరాస్తే.. మరికొన్ని జట్లు చెత్త రికార్డులను మూటగట్టుకున్నాయి. 2015 ప్రపంచకప్‌లో 14 జట్లు పోటీపడితే.. ఈసారి 2019 ప్రపంచకప్‌లో 10 జట్లు బరిలో దిగుతున్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఏ జట్టును తక్కువ అంచనా వేయడం సరికాదనే చెప్పాలి. ఇంగ్లాండ్, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్ తదితర జట్లు హాట్ ఫేవరెట్‌లుగా ఉన్నాయి. ఈసారి ప్రపంచకప్‌లో చాలా రికార్డులు బద్దలు కావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని జట్లలో కొందరూ బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వీరు ఈసారి కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పడం ఖాయమనిపిస్తోంది. గత వరల్డ్‌కప్‌లలో బ్యాట్స్‌మెన్‌లు కొన్ని అద్భుతమైన రికార్డులు నెలకొల్పారు. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై భారత్ తరపున 175 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో కపిల్‌దేవ్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ అందరూ గుర్తు చేస్తారు. అలాగే చాలా మంది బ్యాట్స్‌మెన్‌లు తమతమ జట్ల తరపున చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో ఒంటి చెత్తో మ్యాచ్‌లను గెలిపించి చరిత్రలో నిలిచిపోయారు.
వాటిలోనే కొన్ని టాప్ బ్యాట్స్‌మెన్‌లు నమోదు చేసిన అత్యధిక పరుగుల రికార్డులను ఓసారి చూద్దాం..
మార్టిన్ గుప్టిల్ పరుగులు (2015 ప్రపంచకప్)..
2015 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ సంచలనం సృష్టించాడు. వెల్లింగ్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుప్టిల్ (237 పరుగులు) విధ్వంసర ఇన్నింగ్స్‌తో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో వ్యక్తిగతంగా ఇదే అత్యధిక పరుగులు. కరీబియన్ బౌలర్లపై విరుచుకుపడ్డ మార్టిన్ ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్‌లో గుప్టిల్ (237 నాటౌట్; 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లు) పరుగుల సునామీ సృష్టించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో దిగిన వెస్టిండీస్ 30.3 ఓవర్లలో 250 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా కివీస్‌కు 143 పరుగులు భారీ విజయం దక్కింది.
క్రిస్ గేల్ పరుగులు (2015 ప్రపంచకప్)..
2015 ప్రపంచకప్‌లోనే మరో బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రపంచకప్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (215; 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో) చెలరేగిపోయాడు. ఇతని ధాటికి జింబాబ్వే బౌలర్లు విలవిలలాడారు. గ్రౌండ్ మొత్తం గేల్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తింది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఘనత గేల్‌కే దక్కింది. కానీ కొన్ని రోజుల తర్వాతే ఇదే ప్రపంచకప్ పోటీల్లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. దాంతో గేల్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానంకు పడిపోయాడు. ఇక జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో గేల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు శామ్యూల్స్ (133 నాటౌట్) కూడా శతకంతో చెలరేగాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 372 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు డక్‌వర్త్‌లూయిస్ పద్దతి ప్రకారం 73 పరుగుల విజయం దక్కింది.
గారీ క్రిస్టన్ పరుగులు (1996 ప్రపంచకప్)..
సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ గారీ క్రిస్టెన్ 1996 ప్రపంచకప్‌లో కొత్త అధ్యాయనం లిఖించాడు. యూనైటెడ్ ఎమిరెట్స్ (యుఎఇ)తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సఫారీ ఓపెనర్ క్రిస్టన్ (188 నాటౌట్) పరుగులతో సంచలనం సృష్టించాడు. రావల్‌పిండి వేదికగా యుఎఇతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టులో విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడిన గారీ క్రిస్టన్ 159 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 188 పరుగులు చేసి కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా క్రిస్టన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే ఓవరాల్‌గా ఇప్పుడు ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన. ముందు కుదురుగా ఆడిన క్రిస్టన్ సెంచరీ తర్వాత చెలరేగి బ్యాటింగ్ చేశాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యుఎఇ 50 ఓవర్లలో 152/8 పరుగులే చేసి 169 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుంది. గారీ క్రిస్టన్ నమోదు చేసిన ఈ ప్రపంచ రికార్డును దాదాపు 20 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ బద్దలు కొట్టాడు.
సౌరవ్ గంగూలీ పరుగులు (1999 ప్రపంచకప్)..
1999 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు. టౌంటన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే రమేశ్ (5) రూపంలో షాక్ తగిలింది. ఈ సమయంలో వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ ద్రవిడ్‌తో కలిసి మరో ఓపెనర్ గంగూలీ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరు రెండో వికెట్‌కు (318) పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశారు. ఆ సమయంలో ఇది రెండో వికెట్‌తో పాటు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయ బ్యాటింగ్ చేసిన సౌరవ్ గంగూలీ (183; 158 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి రికార్డు సృష్టించాడు. భారత్ తరపును కపిల్‌దేవ్ నెలకొల్పిన (175) అత్యధిక పరుగుల రికార్డును తాజా మ్యాచ్‌లో గంగూలీ చెరిపేశాడు. ఇక ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఇది నాలుగో అత్యుత్తమ స్కోరు. ఇక ఈ మ్యాచ్‌లో మరో బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ (145) శతకం బాదడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 373 పరగుల భారీ స్కోరు చేసింది. ఆ సమయంలో పరుగుల పరంగా కూడా భారత్‌కు ఇది అత్యుత్తమ స్కోరు. తర్వాత లక్ష్యఛేదనలో శ్రీలంక 216 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 157 పరుగుల భారీ విజయం దక్కింది.
వివ్ రిచర్డ్ (1987 ప్రపంచకప్)
1987 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రిచర్డ్ (181; 125 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇతని ధాటికి శ్రీలంక బౌలర్లు విలవిలలాడారు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రిచర్డ్ మరో ఓపెనర్ దేశ్‌మొండ్ హైనెస్ కలిసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. హైనెస్‌తో కలిసి మూడో వికెట్‌కు 182 పరుగులు కూడా జోడించాడు. ఆ సమయంలో సర్ వివ్ రిచర్డ్ నమోదు చేసిన (181) పరుగులు ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు. దాంతో రిచర్డ్‌సన్ కొత్త రికార్డుతో తన స్థాయిను మరోసారి చాటుకున్నాడు. రిచర్డ్ వంటి ఆటగాళ్లు చాలా అరుదనే చెప్పాలి. రిచర్డ్ నమోదు చేసిన ఈ ప్రపంచ రికార్డును దాదాపు తొమిదేళ్ల తర్వాత 1996 ప్రపంచకప్‌లో గారి క్రిస్టెన్ బ్రేక్ చేశాడు.
5గురు ధీరులు..
RELATED ARTICLES