ఫిర్యాదులు వస్తే ఉన్నతాధికారులకు పండుగే
విచారణ పేరుతో కాలయాపన
ఏళ్లు గడిచినా చర్యలు శూన్యం
ప్రజాపక్షం/ ఖమ్మం : మెప్మాలో లేని మహిళా సంఘాలకు లక్షలాది రూ పాయలు రుణాలు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించి కోట్ల రూపాయలు కాజేశారు. పాపం పండి విషయం బయటకు పొక్కింది. ప్రాథమిక దర్యాప్తులో రూ.2.5 కోట్లు పక్కదారి పట్టినట్లు తేల్చారు. తర్వాత సిబిసిఐడి దర్యాప్తు అన్నారు, చివరకు తేలింది ఏమిటంటే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఆ ఫైలు లేదని, సంబంధిత అధికారి మాత్రం జనగాం జిల్లాలో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నాడని. ఖమ్మం జిల్లాలో మీ ద్వారా నకిలీ పహాణీలు సృష్టించి కోట్లాది రూపాయల బ్యాంక్ రుణాలు పొందారు. నకిలీ పహాణీల్లో పేర్కొన్న రైతులు అసలు దేశంలోనే లేరు. సంబంధిత రెవెన్యూ, బ్యాంక్ అధికారులపై విచారణ జరిపారు. విచారణ ఏమైందో కానీ అధికారులకు మాత్రం పదోన్నతి లభించింది. ఖమ్మం నడిబొడ్డున ప్రభుత్వ స్థలాన్ని ఓ తహశీల్దార్ ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విచారణ నడిచింది. అనంతరం తహశీల్దార్‌కు ఆర్‌డిఒగా పదోన్నతి లభించింది. భూ పంచాయతీ న్యాయస్థానంలో ఉంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఈ-నామ్ వ్యవస్థను దెబ్బతీసేందుకు అల్ల ర్లు సృష్టించారు.మార్కెట్‌కు సంబంధించిన వ్యక్తులే కంప్యూటర్లు, ఇతర సామగ్రి దగ్ధం చేశా రు. కొంత మంది రైతులపై దేశద్రోహం కింద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఈ-నామ్ ధ్వంసానికి సంబంధించి విచారణ చేపట్టినట్లు అప్పట్లో పేర్కొన్నారు. రెండు సంవత్సరాలు గడచింది. ఏమైందో అధికారులకు తప్ప ఎవరికీ తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. విచారణ ఎదుర్కొంటున్న అధికారులు పదోన్నతులు పొందుతూనే ఉన్నారు. ఇక చిన్న చిన్న ఉద్యోగులపై ఫిర్యాదు చేయడాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఫిర్యాదుపై విచారణకు వచ్చే అధికారికి తులమో ఫలమో ముట్టజెప్పి ఫిర్యాదును బుట్టదాఖలు చేయించుకోవచ్చు. ఉన్నతాధికారికి ఒక్కసారి మామూళ్లు ఇచ్చిన తర్వాత నిబంధనలను కాదని మరో రెండు మూడు ఫైళ్లు చక్కబెట్టుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఇందులో రెవెన్యూ, విద్యుత్తు, పంచాయతీ శాఖలు ముందు వరుసలో ఉన్నాయి. జిల్లా అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారుల విషయంలో ఇదే తీరు కనబరుస్తున్నారు. సంబంధిత శాఖలో ఒక ఫిర్యాదు విచారణ అధికారికి, విచారణ ఎదుర్కొంటున్న ఉద్యోగికి మేలు చేస్తుంది. ఫలితం దక్కనిది ఫిర్యాదుదారునికి మాత్రమే. అందుకే మరక మంచిదే.