ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవని ఇంగ్లీష్ జట్టు
ప్రజాపక్షం/క్రీడా విభాగం: ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ గెలవడం ప్రతి జట్టు కల. కానీ అందులో కొన్ని జట్లు సఫలమవుతాయి. మరికొన్ని జట్లు విఫలమవుతాయి. ఐసిసి ఆధర్యంలో ప్రతి నాలుగు సంవత్సరాలలో ఒకసారి వన్డే క్రికెట్ వరల్డ్‌కప్ నిర్వహిస్తారు. 1975లో తొలి వన్డే ప్రపంచకప్ పోటీలు జరిగాయి. చివరిసారిగా 2015లో జరిగింది. ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్ వేదికగా 2019 ప్రపంచకప్ సమరం జరగనుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు అందరి కంటే ఎక్కువ 5 సార్లు ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. తర్వాత భారత్, వెస్టిండీస్ చెరో రెండుసార్లు విజేతలుగా నిలవగా.. పాకిస్థాన్, శ్రీలంకలు తలోసారి ట్రోఫీని దక్కించుకున్నారు. అయితే ప్రపంచకప్ ఆరంభమై ఇప్పటికి దాదాపు 44 సంవత్సరాలు అవుతోంది. కానీ క్రికెట్ పుట్టిల్లుగా చెప్పుకొనే ఇంగ్లీష్ జట్టయిన ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా ప్రపంచకప్ ట్రోఫీని గెలవకపోవడం గమనార్హం. ఈ వార్త వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం. ఇంగ్లాండ్‌లోనే క్రికెట్ పుట్టింది. అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఈ క్రికెట్ ఆట వ్యాపించింది. 1975 నుంచి 2015 వరకు మొత్తం 11 ప్రపంచకప్ పోటీలు జరిగాయి. అందులో ఇంగ్లాండ్ జట్టు మూడు సార్లు ఫైనల్లో ప్రవేశించి ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేక పోయింది. ఇప్పటికీ ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్ ట్రోఫీ అందని ద్రాక్షగానే ఉంది. అయితే ఈసారి సొంతగడ్డపై ప్రపంచకప్ సమరం జరగనుండడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చేటట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భీకర ఫామ్‌లో ఉంది. అంతే కాకుండా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లోనూ ఇంగ్లాండ్ జట్టు మొదటి స్థానంలో ఉంది. వరుస విజయాలతో ఇంగ్లీష్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఈసారి ప్రపంచప్‌లో ఇంగ్లాండ్ జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.
తొలి సీజన్‌లో సెమీస్ వరకే..
సొంతగడ్డపై జరిగిన తొలి సీజన్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్‌కు నిరాశే మిగిలింది. 1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు మైక్ డెన్నెస్ సారథ్యం వహించాడు. అయితే ఫేవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు లీగ్ దశలో మంచి ప్రదర్శనలు చేస్తూ వరుస విజయాలతో సెమీఫైనల్ వరకు చేరింది. గ్రూప్ దశలో తన తొలి మ్యాచ్‌లో భారత్‌ను 202 పరుగుల భారీ తేడాతో ఓడించి టోర్నీని శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 60 ఓవర్లలో 334/4 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ డెన్నిస్ ఆమిస్ (137) పరుగులతో చెలరేగాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీనివాస్ వెంకటరాఘవన్ సారథ్యంలోని భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సునీల్ గవాస్కర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన గవాస్కర్ చివరి వరకు (60 ఓవర్లు) అజేయంగా క్రీజులో నిలిచి 174 బంతుల్లో ఒక ఫోర్ కేవలం 36 పరుగులే చేశాడు. ఇప్పటికీ ఇది చెత్త రికార్డుల్లో ఒకటి. తర్వాత కూడా ఆదే జోరును ప్రదర్శించిన ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్‌కు చేరింది. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు చెత్త ప్రదర్శన చేశారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 93 పరుగులకే ఆలౌటయ్యారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మూడు సార్లు రన్నరప్‌గా..
తొలి సీజన్‌లో సెమీస్ వరకే పరిమితమైన ఇంగ్లాండ్ తర్వాతి సీజన్‌లలో మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంది. తర్వాత జరిగిన నాలుగు సీజన్‌లలో ఇంగ్లాండ్ మూడు సార్లు రన్నరప్‌గా నిలిచి సత్తా చాటుకుంది. కానీ ట్రోఫీ మాత్రం గెలవలేక పోయింది. 1979లో జరిగిన రెండో ప్రపంచకప్ కూడా ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. ఈసారి కూడా ఇంగ్లాండ్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగింది. అలాగే ఆ టోర్నీలో ఇంగ్లీష్ జట్టు తన స్థాయికి తగ్గట్టే ఆడింది. వరుస విజయాలతో టోర్నీలో ప్రత్యర్థులను హడలెత్తించింది. చివరికి సునాయాసంగా ఇంగ్లాండ్ సెమీస్‌లో ప్రవేశించింది. ఈసారి సెమీస్‌లో తడబడకుండా ఆడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ భరితమైన సెమీస్ పోరులో ఇంగ్లాండ్ 9 వికెట్లతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో ఇంగ్లాండ్ ప్రత్యర్థి డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్. సెమీస్‌లో విండీస్ జట్టు పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఇక భీకర ఫామ్‌లో ఉన్న విండీస్‌తో కప్ పోరు అంటే ఇంగ్లాండ్ ముందుగానే ఒత్తిడికి లోనైంది. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 60 ఓవర్లలో 286/9 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 51 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా వెస్టిండీస్ 92 పరుగులతో విజయం సాధించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా అవతరించగా.. మరోవైపు ఇంగ్లాండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తర్వాత జరిగిన 1987, 1992 ప్రపంచకప్‌లలో ఇంగ్లాండ్ వరుసగా రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన 1987 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో తృటిలో ప్రపంచకప్‌ను చేజార్చుకుంది. 1992 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడి మరోసారి ట్రోఫీను కోల్పోయింది. తమ జట్టు తొలి ఐదు ప్రపంచకప్ సమరాల్లో మూడు సార్లు ఫైనల్స్‌కు చేరిన ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది.
చెత్త ప్రదర్శనలు..
తొలి సీజన్‌లలో అద్భుతంగా ఆడిన ఇంగ్లాండ్ రానురాను తమ ఆటను పేలావంగా మార్చుకుంది. వరుస ఓటములతో కనీసం గ్రూప్ దశలను కూడా దాటలేక పోయింది. తొలి ఐదు సీజన్‌లలో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లాండ్.. రెండు సార్లు సెమీఫైనల్‌కు చేరింది. కానీ ఆ తర్వాతి సీజన్‌లలో ఇంగ్లీష్ జట్టు చేత్త ప్రదర్శనలతో తమ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. చివరి ఆరు సీజన్‌లలో ఇంగ్లాండ్ జట్టు రెండు సార్లు మాత్రమే క్వార్టర్ స్టేజ్‌కు చేరుకోగలిగింది. మిగితా నాలుగు సీజన్‌లలో గ్రూప్‌స్టేజ్‌కే పరిమితమైంది. 2015లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన చివరి ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు పేలావంగా ఆడింది. ఇయాన్ మోర్గన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు 6 మ్యాచుల్లో కేవలం రెండే విజయాలు నమోదు చేసి గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈసారి హాట్ ఫేవరెట్‌గా..
గత సీజన్‌లలో చెత్త ఆటతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన ఇంగ్లాండ్ ఈసారి 2019 ప్రపంచకప్‌లో మాత్రం ట్రోఫీ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ప్రస్తుతం ప్రపంచ జట్లలో ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా ఉంది. ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అందరి కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ నంబరవన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈసారి కూడా ఇయాన్ మోర్గన్ సారథ్యంలోనే ఇంగ్లాండ్ జట్టు బరిలో దిగుతోంది. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసే ఆటగాళ్లకు ఈ జట్టులో కొదువలేదు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్ భీకర ఫామ్‌లో ఉన్నారు. వీరితోపాటు జోయ్ రూట్, ఇయాన్ మోర్గన్, జోస్ బట్లర్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, మోయిన్ అలీలతో కూడిన బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక బౌలింగ్‌లో క్రిస్ వోక్స్, మార్క్ వూడ్, డేవిడ్ వీలే, లియమ్ ప్లుంకెట్, టామ్ కర్రన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. కొంత కాలంగా ఇంగ్లాండ్ జట్టు మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకొంటుంది. ఆసారి ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లోనే జరగడం ఈ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈసారి ఇంగ్లాండ్‌కే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం ఇతర జట్లకు పెద్ద సవాల్ లాంటిదే. సొంతగడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచకప్‌ను గెలిచి తమ ప్రపంచకప్ లోటును మోర్గన్ సేన అధిగమిస్తుందేమో వేచి చూద్దాం.
ఇంగ్లాండ్ ప్రపంచకప్ జట్టు : ఇయాన్ మోర్గన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), టామ్ కర్రన్, జోయ్ డెన్లీ, లియమ్ ప్లుంకెట్, ఆదిల్ రషీద్, జోయ్ రూట్, జాసన్ రాయ్, బెన్‌స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్‌వూడ్.