కాళేశ్వరంపై కేసులన్నింటినీ కలిపి విచారణ చేపట్టాలి
హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
ప్రజాపక్షం/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులన్నింటిని త్వరగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ దశలను సవాల్ చేస్తూ మొ త్తం 177 వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వా టన్నింటినీ కలిపి విచారణ చేపట్టాలని కోరు తూ ప్రభుత్వం బుధవారం అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నందున.. వ్యాజ్యాలన్నీ కలిపి విచారణ చేపట్టి త్వరగా తేల్చాలని కోరింది. తమకు పునరావాసం కల్పించకుండా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్థులు కొందరు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై బుధవారం వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అందించిన పునరావాస, ఉపాధి చర్యలపై నివేదిక సిద్ధం చేశామని.. అయితే రిజిస్ట్రీ సమయం అయిపోయిందని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు ధర్మాసనానికి తెలిపారు. ఆ నివేదికను నేరుగా తమకు సమర్పించాలని సూచించిన హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.