న్యూఢిల్లీ: క్రీడారంగానికి చెందిన అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్త్న్ర అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ రెజర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ పేర్లను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) ప్రతిపాదించింది. ప్రపంచ నంబర్ వన్ అయిన బజరంగ్ ఇటీవల జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది బజరంగ్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. గత రెండేళ్లుగా బజరంగ్ అంతర్జాతీయంగా రాణిస్తూ భారత్‌కు అనేక పతకాలు తీసుకొచ్చాడు. ఫొగట్ సిస్టర్స్‌లో ఒకరైన వినేశ్ ఫొగట్ ఇటీవలి కాలంలో తన సత్తా చాటింది. ఈ ఏడాది ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన వినేశ్.. గతేడాది జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అంతే కాకుండు ఏషియన్స్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ కొత్త రికార్డు సృష్టించింది. వీరి ప్రతిభకు గుర్తింపుగా ఖేల్త్న్ర అవార్డుతో సత్కరించాలని డబ్ల్యూఎఫ్ఐ కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరితో పాటు భీమ్ సింగ్, జై ప్రకాశ్ పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు, రాహుల్ అవారే, హర్‌ప్రీత్ సింగ్, దివ్యా కక్రన్, పూజా ధందాలను అర్జున అవార్డుకు డబ్ల్యూఎఫ్ఐ ప్రతిపాదించింది. కోచ్‌లు వీరేంద్ర కుమార్, సుజీత్ మన్, నరేంద్ర కుమార్, విక్రమ్ కుమార్ పేర్లను ద్రోణాచార్య అవార్డుకు సిఫార్సు చేసింది.