ముహూర్తం మే 6,10, 14
కాగితం బ్యాలెట్ వినియోగం ఫలితాలు మాత్రం మే 27న
40 ఎంపిటిసి, ములుగు జిల్లా మంగపేట జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ ఇంకా ముగియక ముందే ఎంపిటిసి, జడ్పిటి సి ఎన్నికలకూ నగారా మోగింది. రా ష్ట్రంలోని 32 జిల్లాల్లో ఎంపిటిసి, జెడ్పిటిసి సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ ముగిసిన కేవలం నెల రోజుల లోపే గ్రామాల్లో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. మొత్తం మూడు విడతల్లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలను నిర్వహిస్తారు. నాలుగు నెలల్లో ఇది నాలుగో ఎన్నిక. పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికలను బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మే 27న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శనివారం నాడు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల షెడ్యూలును ఆయన మీడియాకు విడుదల చేశారు. తొలి విడత ఎన్నికలను మే 6వ తేదీన, రెండో దశ ఎన్నికలను మే 10 తేదీన, అలాగే మూడో విడత ఎన్నికలను మే నెల 14న నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు విడతల ఎన్నికలు ముగిశాక మే నెల 27వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టి అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి పేర్కొన్నారు. తొలి దశ పోలింగ్‌కు ఈ నెల 22న , అలాగే రెండో దశకు ఈ నెల 26న , మూడో దశకు ఈ నెల 30న ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేస్తుందన్నారు. రాష్ట్రంలో 5857 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, టర్మ్ కాల పరిమితి పూర్తి కాక పోవడం, కోర్టు వ్యాజ్యాల కారణంగా రాష్ట్రంలో 40 ఎంపిటిసి స్థానాలను ఇందులో మినహాయించి మిగతా 5817 ఎంపిటిసి స్థానాల్లో ఎన్నికలు జరుపుతున్నామన్నారు. ములుగు జిల్లా మంగపేట జడ్పిటి స్థానానికి కూడా పోలింగ్ నిర్వహించడం లేదని నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గాను 32,042 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని 538 జడ్పిటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 1,56, 11,,474 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. వీరిలో పురుషులు 77,34,800 మంది ఉండగా, మహిళలు 78,76,361 మంది అలాగే థర్డ్ జెండర్స్ 313 మంది ఉన్నారని నాగిరెడ్డి తెలిపారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు లక్ష్యా 47 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. రిజర్వేషన్ల వారీగా చూస్తే 539 జడ్పిటిసిలకు గాను ఎస్సిలకు 94,ఎస్టిలకు 79, బిసిలకు 90 కాగా 276 అన్ రిజర్వుడ్ స్థానాలుగా ఉన్నాయన్నారు.