ప్రజాపక్షం/హైదరాబాద్ లీగల్: వెనుకబడిన తరగతుల జనాభాను లెక్కించి రిజర్వేషన్లు ఖరారు చేశాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న తమ ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయకపోవడంతో సర్కార్‌పై దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలై మూడు మాసాలు అవుతున్నా కూడా ప్రభుత్వానికి కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేసే తీరిక లేకుండా ఉందా..? అని నిప్పులు చెరిగింది. జూన్ 14లోగా కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. జాప్యానికి కారణమైన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సివస్తుందని తేల్చి చెప్పింది. బిసి జనాభా లెక్కల గణన చేశాకే చట్ట ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు ఖరారు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో అందుకు అనుగుణంగా చేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల్ని అమలు చేయకపోవడంతో పిటిషనర్ బిసి సంఘం అధ్యక్షుడు జె. శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్ రామచందర్‌రావు విచారించారు. గతంలోని హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయని ప్రభుత్వం ఎన్నికలు వెడుతోందని పిటిషనర్ లాయర్ వంగా రామచంద్రగౌడ్ వాదించారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాల గురించి ప్రభుత్వానికి తెలియదని అదనపు ఎజి జె.రామచంద్రరావు బదులివ్వడంతో న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. వ్యవధి ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన కోరడంతో అందుకు జూన్ 14 వరకూ న్యాయమూర్తి సమయం ఇచ్చారు.
రాష్ట్ర సర్కార్‌పై హైకోర్టు ఫైర్
RELATED ARTICLES