HomeNewsBreaking Newsఎన్నికల్లో ఎత్తుపల్లాలు తప్పవు

ఎన్నికల్లో ఎత్తుపల్లాలు తప్పవు

వామపక్షాలకు అస్థిత్వ ముప్పు లేదు
బిజెపి వ్యతిరేక పార్టీలకే ఎక్కువ సీట్లు
బెంగాల్‌లో బిజెపి కంటే లెఫ్ట్‌ బలంగా ఉంది
వాయనాడ్‌లో పోటీ రాహుల్‌ అపరిపక్వ నిర్ణయం
‘పిటిఐ’ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో సురవరం

ప్రజాపక్షం/హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయని, ఎన్‌డిఎ కంటే బిజెపియేతర, బిజెపి వ్యతిరేక పార్టీలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలు వస్తాయని సిపిఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వామ పక్షాలు అస్థిత్వ ముప్పును ఎదుర్కొవడం లేదని, అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించేందుకు లోక్‌సభలో బలాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. వామపక్షాలు క్లిష్టమైన స్థితిలో ఉండ డానికి ఒకవైపు బిజెపి అధికారంలో ఉండడం, మరో వైపు 2014 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడమే కారణమని వివ రించారు. “ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు వామపక్షాలకు అత్యంత ముఖ్యమైనవి. లోక్‌సభలో మా బలాన్ని పెంచు కోవడం ఎంతో ముఖ్యం” అని ‘పిటిఐ’ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురవరం పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని, కాని ప్రజా సంఘాల బలం తరిగిపోలేదని, అయితే ఓట్లశాతం కొంత తగ్గిందని చెప్పా రు. ప్రస్తుత ఎన్నికల విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, ఇది దామాషా పద్ధతిలో లేదని అభిప్రాయపడ్డారు. వామ పక్షాలకు ఉన్న బలానికి తగినట్లు ఎన్నికల్లో సీట్లు రావడం లేదని, ఎన్నికల అవగాహన ఉంటే కొంత సాధ్యమవు తోందని, కాని ఇటీవల కాలంలో అది సాధ్యపడడం లేదని వివరించారు. అయితే వామపక్షాల అస్థిత్వానికి ముప్పు ఏర్పడిందని తాను అనుకోవడం లేదని, అలాంటి వాదనను తాను నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నానని సురవరం స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు తమకు చావోరేవో లాంటివి కావని, నిస్సందేహంగా కీల కమైనవేనని, తాము బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌  గుండాయిజానికి వ్యతిరేకంగా వామపక్షాలు నిలబడలేకపోతున్నాయని, దీంతో విసిగిపోయిన కొంత మంది వామపక్ష మద్దతుదారులు తృణమూల్‌ను ఓడించేందుకు బిజెపిలో చేరారరని, దీంతో ఆ పార్టీ కొంత ఓటు శాతాన్ని పొందుతోందన్నారు. అయినప్పటికీ బెంగాల్‌లో బిజెపి కంటే వామపక్షాలే బలమైన శక్తిగా ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలోని వాయనాడ్‌ స్థానం నుండి పోటీ చేయడం ద్వారా కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌లోనే కాకుండా సామాన్య లౌకికవాద ప్రజల్లో కూడా అపోహలను సృష్టించారని అన్నారు. రాహుల్‌గాంధీ సుదూరంలోని వాయనాడ్‌కు వచ్చి వామపక్షాలపై పోటీ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ప్రజలకు అర్థం కావడం లేదని, ఇది రాహుల్‌గాంధీ తీసుకున్న అపరిపక్వ నిర్ణయమని సురవరం వ్యాఖ్యానించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments