వృద్ధ రైతులకు తొలిసారి పెన్షన్ హామీ
రైతులందరికీ రూ.6 వేలు ఉచితం
మతతత్వ, విభజనవాద ఎజెండా పునరుద్ఘాటన
రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు,
పౌరసత్వ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
బిజెపి ఎన్నికల ‘సంకల్ప పత్రం’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ఇక మూడు రోజులుందనగా భారతీయ జనతా పార్టీ ‘సంకల్ప్ పత్’్ర (వాగ్దానాల పత్రం) పేరిట తన మ్యానిఫెస్టోను సోమవారం విడుదలచేసింది. ఇందులో అనేక వాగ్దానాలు చేసింది. సత్వరం రామ మందిర నిర్మాణం, ఉగ్రవాదాన్ని తీవ్రంగా అణచేయడం, రానున్న మూడేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం, 2030 నాటికల్లా భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం, జమ్మూకశ్మీర్‌కు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ను రద్దు చేయడం, కశ్మీర్లో బయటి ప్రాంతాల వాళ్లు ఆస్తిపాస్తులు కొనకుండా, అక్కడి మహిళలు ఇతరులను పెళ్లిచేసుకున్నా వారికి ఆస్తి హక్కులు దక్కకుండా చేస్తున్న ఆర్టికల్ 35ఎ రద్దు చేయడం సహా 19 అంశాలపై పెద్ద వాగ్దానాలు చేస్తూ మ్యానిఫెస్టోను విడుదలచేసింది. ఆర్థిక రంగంలో భారత్‌ను 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది బిజెపి ఆశయం. ‘2025 నాటికి భారత్‌ను 5 అమెరికన్ డాలర్ల ట్రిలియన్ల ఆర్థికవ్యవస్థగా, 2032 నాటికి 10 అమెరికన్ డాలర్ల ట్రిలియన్ల ఆర్థికవ్యవస్థగా చేయలన్నది తమ సంకల్పం’ అని బిజెపి మ్యానిఫెస్టోలో పేర్కొంది. సంబంధిత వ్యక్తులతో చర్చించి వస్తు,సేవల పన్ను(జిఎస్టి)ను సరళం చేస్తానని కూడా పేర్కొంది. ఒకవేళ ఓటేసి గెలిపిస్తే ఉగ్రవాదాన్ని అస్సలు సహించకుండా నిర్మూలిస్తానని వా గ్దానం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే భద్రతా బలగాలకు కావాలసినంత స్వేచ్ఛనిస్తానంది.
జాతీయవాదమే మా ప్రేరణ: మోడీ
‘జాతీయవాదమే తమ పార్టీకి ప్రేరణ, అదే కలుపుకుపోవడం, సుపరిపాలన మంత్రం’అని బిజెపి మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన వం దేళ్లకు అంటే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్నది తమ సంకల్పం అన్నారు. బిజెపి ‘సంకల్ప్ పత్’్ర(తీర్మాన దస్తావేజు)లో దేశం కోసం సాధించాలనుకుంటున్న 75 నిర్ధిష్ట అంశాలను పేర్కొంది. ‘ప్రజలు జవాబుదారీ లు కావాలని మేము కోరుకుంటున్నాం.