గెలిచే జట్టు టాప్‌కు
నేడు చెన్నైతో ఢీకొననున్న కోల్‌కతా
రాత్రి 8 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం
చెన్నై : ఐపిఎల్‌లో మంగళవారం దిగ్గజాల పోరు జరగనుంది. ఒకవైపు పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్.. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. వీరిద్దరూ ఈ సీజన్‌లో వరుస విజయాలతో తమతమ జోరును ప్రదర్శిస్తున్నారు. ఇరు జట్లు చెరో నాలుగు విజయాలతో అత్యధికంగా 8 పాయింట్లు సాధించారు. అయితే ఇద్దరూ సమానంగానే ఉన్న రన్‌రేట్ పరంగా కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో విజయాలు సాధించి ఒక ఓటమిని చవిచూసింది. మరోవైపు ఢిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్‌కె హ్యాట్రిక్ విజయాలతో జోరును ప్రదర్శించింది. తర్వాత నిలుగో మ్యాచ్‌లో ఓటమిపాలైన ఐదో మ్యాచ్‌లో మరో గెలుపుతో తిరిగి పుంజుకుంది. ఇరుజట్లలో ఎవరూ గెలుస్తారో అంచనా వేయడం కష్టంగానే ఉంది. ఈ రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి. కానీ చెన్నైను వారి సొంతగడ్డపై ఓడించడం నైట్‌రైడర్స్‌కు పెద్ద సవాలే. ఎందుకంటే చెన్నైలో ధోనీ సేనకు మంచి రికార్డు ఉంది. అయితే ఈసారి సిఎస్‌కె బ్యాట్స్‌మెన్స్ తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శనలు చేయలేక పోతున్నారు. ముఖ్యంగా షేన్ వాట్సన్, అంబటి రాయుడు, మురళి విజయ్ తదితరులు భారీ పరుగులు నమోదు చేయడంలో విఫలమవుతున్నారు. సురేశ్ రైనా, కెప్టెన్ ధోనీ ఆడపాదడపా ఆడుతూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇక బౌలింగ్‌లో పేస్ విభాగం కూడా ఆకట్టుకోలేక పోతుంది. స్పిన్నర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నా పేసర్లు మాత్రం తేలిపోవడం చెన్నైను కలవరపెడుతోంది. ఇక పటిష్టమైన కోల్‌కతాతో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు పూర్తి స్థాయి ఆటను ప్రదర్శిస్తారిని సిఎస్‌కె యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం బీకర ఫామ్‌లో కనబడుతోంది. ఆ జట్టు హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. ఇప్పటివరకు తన అసాధారణ బ్యాటింగ్‌తో కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. మరోవైపు రాబిన్ ఉత్తప్ప, క్రిస్ లీన్, సునీల్ నరైన్, దినేశ్ కార్తిక్ మంచి లయలో ఉన్నారు. బౌలర్లు సైతం నిలకడగా ఆడుతుండడం కెకెఆర్‌కు కలిసివస్తోంది. ఏదిఏమైన కోల్‌కతా, చెన్నై జట్లు జోరుమీదుండడంతో ఇరుజట్ల మధ్య మంగళవారం జరిగే మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది.
జట్ల వివరాలు
కోల్‌కతా నైట్ రైడర్స్ : దినేశ్ కార్తిక్ (కెప్టెన్, వికెట్ కీపర్), రాబిన్ ఉత్తప్ప, క్రిస్ లీన్, శుభ్‌మాన్ గిల్, ఆండ్రీ రస్సెల్, బ్రాత్‌వైట్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, నిఖిల్ నాయక్, జోయ్ డెన్లీ, శ్రీకాంత్ ముండే, నితీస్ రాణా, సందీప్ వారియర్, ప్రసిధ్ కృష్ణన్, లూకీ ఫెర్గ్యూసన్, హారి గుర్నే, కెసి కరియప్ప, యర్ర పృథ్వీరాజ్.
చెన్నై సూపర్ కింగ్స్ : మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), షేన్ వాట్సన్, డుప్లెసీస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, కెదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మురళీ విజయ్, దీపక్ చాహర్, డేవిడ్ విల్లే, మోహిత్ శర్మ, దృవ్ షొరే, చైతన్య బిష్నోయ్, రితురాజ్ గైక్వాడ్, షార్దుల్ ఠాకుర్, కెఎమ్ ఆసీఫ్, ఎన్ జగదీశన్, కరణ్ శర్మ.