దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్న కేంద్ర ప్రభుత్వం: బిఎస్‌పి సుప్రీం మాయావతి
దేవ్‌బండ్: ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బండ్‌లో బిఎస్‌పి ఎస్‌పి ఆర్‌ఎల్‌డి కూటమి సంయుక్తంగా తొలిసారి ఆదివారం ర్యాలీ నిర్వహించాయి. మొదటి విడత లోక్‌సభ ఎన్నికలు జరగడానికి ఇంకా సమయం వారంలోపే ఉండడంతో కూటమి నిర్వహించిన ర్యాలీలో బిఎస్‌పి సుప్రీం మాయావతి పాల్గొని బిజెపి, కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. ద్వేషాన్ని ప్రేరేపించే విధానాలు ముఖ్యంగా చౌకీదార్ ప్రచారంతో బిజెపి ఈ ఎన్నికల్లో పరాజయం పొందక తప్పదని ఆమె విమర్శించారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్‌ఎల్‌డి చీఫ్ అజిత్‌సింగ్ హాజరైన ఈ ర్యాలీలో మాట్లాడుతూ అనేక ఏళ్లపాటు కాంగ్రెస్ దేశాన్ని పాలించినప్పటికీ పూర్తిగా విఫలమైందన్నారు. కనీస ఆదాయ మద్దతుకు బదులు తమ ప్రభుత్వం పేద ప్రజలకు ఉపాధిని కల్పించనుందని ఆమె చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు ఇందిరాగాంధీ కూడా 20 సూత్రా ల కార్యక్రమాన్ని చేపట్టారని, అది సమర్థవంతంగా అమలైందా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల వలే కాకుం డా తాము చాలా మౌనంగా ఉంటామని చెప్పారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండానే తమ పార్టీ తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తుందని, అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీకి ఇస్తున్న అవకాశాలు చాలవా.. అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు ప్రకటించిన ‘న్యాయ్’ పథకం కూడా పేదరికాన్ని నిర్మూలించేందుకు స్థిరమైన పరిష్కారాన్ని చూపదన్నారు. అదే విధంగా బిజెపి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తోందని మండిపడ్డారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీరిని కాంగ్రెస్, బిజెపి అనేక ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రం లేదా రాష్ట్రస్థాయిలో ఈ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లపై పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. మైనార్టీలు కూడా తీవ్రంగా బాధలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ భోఫోర్స్ కుంభకోణంలో కూరుకుపోతే, బిజెపి ప్రభుత్వం రాఫెల్ ఒప్పందంలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బిజెపి తన ప్రత్యర్థులపై సిబిఐ, ఇడి వంటి దర్యాప్తు సంస్థలచే దాడులు చేయిస్తూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తుందని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలకు మరోసారి అధికారాన్ని చేపట్టే అవకాశం ఇవ్వకూడని మాయావతి ఓటర్లకు సూచించారు. అధికారంలోకి వస్తే రైతులను రుణవిముక్తులను చేస్తామని ఆమె హామీనిచ్చారు. యుపిలో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉత్తిత్తి ప్రకటనలు చేస్తూ వారి విజ్ఞప్తిలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. బి-జెపి ఇప్పటికీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేదన్నారు. ఇప్పుడు కాషాయ పార్టీ భయపడుతోందని, ఆ పార్టీ తుడుచిపెట్టుకుపోయి మాహాకూటమి విజయం సాధిస్తుందన్నారు. అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ కాపలాదారులను ఒకరి తర్వాత మరొకర్ని ఓడిస్తామని సవాల్ విసిరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ‘చాయ్‌వాలా’నంటూ వచ్చారని, ఇప్పుడు ‘చౌకీదార్’నంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించడానికి, మార్పు తేవడానికి, సామరస్యాన్ని పెంపొందించడానికి, విద్వేషాన్ని తొలగించడానికి జరుగుతున్నాయన్నారు. బిజెపి నేతలు ఇక్కడికి వచ్చి, మాట్లాడటాన్ని గమనించారా? అని అడిగారు. వాళ్ళు మాట్లాడుతున్నదంతా విద్వేషమేనన్నారు. హామీల గురించి మాట్లాడాలని వాళ్ళు అనుకోవడం లేదన్నారు. అంతకుముందు చాయ్‌వాలానంటూ వచ్చారు, ఇప్పుడు చౌకీదార్‌నంటున్నారు. చాయ్‌వాలాగా ఉన్నపుడు ప్రతి ఖాతాకు రూ.15 లక్షలు జమ చేస్తానన్నారు. కోట్లాది ఉద్యోగాలు ఇస్తామన్నారన్నారు, కానీ చేసిందేమీ లేదన్నారు. ఒకరి తర్వాత మరొకరి చొప్పున మొత్తం అందరు చౌకీదారుల్ని ఓడిస్తామన్నారు.