ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
9న రైతుల ర్యాలీకి అనుమతిచ్చాం
ఇవిఎంల పనితీరుపై 400 మంది ఇంజనీర్లు నిరంతరం పని చేస్తున్నారు
ఓటర్లకు ఎపిక్ కార్డులు, పోలింగ్ స్పిప్పుల పంపిణీ 95 శాతం పూర్తి
మీడియాతో చిట్‌చాట్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్
ప్రజాపక్షం/హైదరాబాద్: మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలను ప్రత్యేక దృష్టితోనే చూస్తున్నామని, అక్కడ ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఆదివారం తనను కలిసి న మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈవిఎంలు చక్కగా పని చేస్తున్నాయని, 2209 సెట్ల యూనిట్ ఫస్ట్ లెవల్ పరిశీలన కూడా పూర్తయిందన్నారు. పోటీ చేస్తున్న కొందరు రైతులు కోరడంతో 9వ తేదీన రైతుల ర్యాలీకి కూడా అనుమతి ఇచ్చామన్నారు. ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు, ఎపిక్ కార్డుల పంపిణీ 95 శాతం పూర్తి చేశామన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కొంత నిదానంగా జరుగుతోందని, ఈనెల 11వ తేదీ నాటికి అందరికీ పంపిణీ చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగాయని, వేసవి ఎండను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికల సమయాన్ని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం నిర్ధేశించారన్నారు. నిజామాబాద్‌లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సాయం త్రం 6 గంటల తర్వాత కూడా క్యూలైన్‌లో ఉన్న వాళ్లంతా ఓటు వేసేలా అవకాశం ఇస్తామన్నారు. ఈవిఎంల పనితీరుపై నిరంతరం చెకింగ్ చేస్తున్నామన్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుండి పోలింగ్ ప్రారంభమయ్యేంత వరకు (ఉదయం 8.00 గం టల వరకు ) మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు, వారి తరపు ఎన్నికల ఏజెంట్లు కూడా ఈ మాక్ పోలింగ్‌ను పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. తన నిజామాబాద్ పర్యటనలో ఈవిఎంల పనితీరును ప్రత్యక్షంగా చూసొచ్చాన్నారు. 400 మంది ఇంజనీర్లు నిరంతరం పని చేస్తున్నారన్నారు. ఇక అక్కడ పోటీ చేస్తున్న రైతు అభ్యర్థుల అనుమానాలను పూర్తిగా నివృత్తి చేశామని, ఈవిఎంలతో ఎన్నికల ఏర్పాట్ల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ రోజున నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఒక హెలీకాఫ్టర్‌తో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హెలీప్యాడ్ సిద్ధం చేశామనానరు. ఎన్నికల సిబ్బంది ఈవిఎంల వినియోగంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రతి ఒక్క సెక్టోరల్ అధికారికి ఒక బెల్ ఇంజనీరును అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వాలెంటీర్లను ఎన్నికల విధుల్లో నియమించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని, అయితే ఆర్మీ మాజీ సిబ్బందిని మాత్రం ఎన్నికల విధుల్లో వినియోగించుకోవడానికి సీఈసి అనుమతి ఇవ్వలేదని సిఇఓ రజత్ కుమార్ తెలిపారు. సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు మరికొన్ని కేంద్ర బలగాలను కూడా కోరామని, అవసరాన్ని బట్టి కేంద్ర బలగాల కేటాయింపు జరిగే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎన్నికల విధులకు ఆటంకం కల్గిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని రజత్ కుమార్ హెచ్చరించారు.