50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు
ఎస్టిలకు 4, ఎస్సిలకు 6, బిసిలకు 6, మహిళలకు 16 జిల్లా పరిషత్‌లు
ఎస్టిలకు 92, ఎస్సిలకు 98, బిసిలకు 94 మండల పరిషత్‌లు
మొత్తం ఎంపిటిసి స్థానాల సంఖ్య 5,859
కొనసాగుతున్న ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ
ప్రజాపక్షం / హైదరాబాద్ : పరిషత్ ఎన్నికల ప్రక్రియలో కీలక పర్వం ఒకటి ముగిసింది. మండల పరిషత్(ఎంపిపి), జిల్లాపరిషత్(జడ్పి)ల రిజర్వేషన్లతో పాటు ఎం పిటిసి స్థానాల ఎంపిక ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ పూర్తి చేసింది. మండల, జిల్లాపరిషత్‌లలో ఎస్సి, ఎస్టి, బిసి, అన్రిజర్వ్డ్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు పూర్తి చేశారు. ఈ ప్రక్రియ గురువారం నాటికి పూర్తవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్న నిబంధనను అధికారులు పరిషత్ రిజర్వేషన్లలోనూ పాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 జిల్లా పరిషత్‌లు, 438 మండల పరిషత్ లు, 6,441 ఎంపిటిసి స్థానాలు ఉండగా ఈ సారి కొత్త మండలాలు, కొత్త జిల్లాలు, కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో వీటి సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్‌లు, 535 మండల పరిషత్‌లు, 5,859 ఎంపిటిసి స్థానాలు ఏర్పడ్డాయి. మం డల పరిషత్‌లలో వంద శాతం గిరిజనులు ఉన్న 33 మండలాలు ఉండగా వీటిని ఎస్టిలకు కేటాయించారు. మిగిలిన 502 మండల పరిషత్‌లలో ఎస్సి, ఎస్టిలకు వారి జనాభా ప్రాతిపదికన, బిసిలకు వారి ఓటర్ల సంఖ్య ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారు. ఈ లెక్కన ఎస్టిలకు 59, ఎస్సిలకు 98, బిసిలకు 94 మం డల పరిషత్‌లు దక్కాయి. అన్‌రిజర్వ్‌డ్‌లో 251 మండల పరిషత్‌లను కేటాయించారు. దీంతో ఎస్టిలకు వందశాతం షెడ్యూల్డ్ మండల పరిషత్‌లను కలుపుకుని మొత్తం 92 ఎంపిపి స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్లలోనూ ఇదే పద్దతిని పాటించారు. మొత్తం 32 జిల్లా పరిషత్‌లు ఉండగా వీటిలో 4 ఎస్టిలకు, 6 ఎస్సిలకు, 6 బిసిలకు కేటాయించగా మిగిలిన 16 అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. ఆయా కేటగిరిలో 50శాతం కోటా కింద మహిళలకు 16 జడ్‌పిలను కేటాయించారు. జిల్లా పరిషత్‌లలో ఎస్టిలకు 13.86 శాతం, ఎస్సిలకు 19.03శాతం, బిసిలకు 17.11 శాతం( మొత్తం 50శాతం) రిజర్వేషన్లను కేటాయించారు. జిల్లా పరిషత్‌ల వారీగా కేటాయించిన రిజర్వేషన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.