HomeNewsBreaking Newsసమమా.. సమర్పణమా..

సమమా.. సమర్పణమా..

ఆత్మవిశ్వాసంతో ఆసీస్‌
సిరీస్‌ డ్రా చేసుకునేందుకు కోహ్లీ సేన కసరత్తులు
నేడు భారత్‌ మధ్య ఆఖరి టి20
రాత్రి 7. గంటల నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం
బెంగళూరు: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరగుతున్న టి20 సిరీస్‌ను ఎలాగైన కాపాడుకోవాలని కోహ్లీ సేనకసరత్తులు చేస్తోంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా 3 వికెట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నేడు చివరిదైన రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి తొలి మ్యాచ్‌ ఓటమికి ప్రతీకారంతో పాటు సిరీస్‌ను డ్రా చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు భారత్‌ గడ్డపై తొలి టి20 సిరీస్‌ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించాలని ఆసీస్‌ ప్రయత్నిస్తోంది. తొలి మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించిన ఆస్ట్రేలియా బుధవారం జరిగే ఆఖరి పోరులో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. ఇక భారత జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో విఫలమైన పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో సిద్దార్థ్‌ కౌల్‌ను లేదా ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను తుది జట్టులో తీసుకునే చాన్స్‌ ఉంది. ఇక ఈ మ్యాచ్‌లోను శిఖర్‌ ధావన్‌ను తీసుకుంటారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ధావన్‌ స్థానంలో తొలి టి20లో ఓపెనింగ్‌ చేసిన కెఎల్‌ రాహుల్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కఠినమైన పిచ్‌పై కూడా దూకుడు ప్రదర్శించి ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. మరోవైపు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తిక్‌కు వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి అవకాశం. ఈ మ్యాచ్‌లో సత్తా చాటుకుంటేనే ప్రపంచకప్‌ జట్టులో అవకాశాలు మెరుగుపడుతాయి. ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోసం గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. లభించిన ప్రతి చాన్స్‌ సద్వినియోగ పరుచుకుంటేనే భవిష్యతు బాగుంటుందని విశ్లేషకుల అంచనా. ఇక మరో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. గత మ్యాచ్‌లో ధోనీ ఆడిన తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. టి20 మ్యాచ్‌లో అలా స్లోగా ఆడటాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ధోనీ కనీసం హిట్టింగ్‌ ప్రయత్నించలేదని, కేవలం తన వికెట్‌ను కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చాడని అతనిపై సోషల్‌ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక యువ సంచలనం రిషభ్‌ పంత్‌పై టీమిండియా భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ అతను తొలి టి20లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అతను కొద్ది సేపైనా క్రీజులో నిలబడితే టీమిండియా మంచి స్కోరు సాధించేది. కానీ అతను చేసిన ఈ తప్పుకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. తర్వాత ఆసీస్‌ బౌలర్లు పైచేయి సాధించి భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఓవరాల్‌గా తొలి మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ల నుంచి టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌, చివరికి లోయర్‌ ఆర్డర్‌లోనూ అందరూ పరుగులు సాధించడంలో తేలిపోయారు. కెఎల్‌ రాహుల్‌, కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్‌ చేతులెత్తేశారు. ఇక ఆఖరి మ్యాచ్‌లోనైనా భారత బ్యాట్స్‌మెన్స్‌ పుంజుకోవాలని, మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలని అందరూ ఆశిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా జట్టు తన పాత ఫామ్‌ను సాధించడం సంతోషంగా ఉందని ఆసీస్‌ సారథి ఆరోన్‌ ఫించ్‌ అంటున్నాడు. ముఖ్యంగా యువ హిట్టర్‌ గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ పుంజుకోవడం తమకు కలిసొచ్చిందని ఆయన అన్నాడు. ప్రపంచకప్‌ ముందు తమకు ఇది పెద్ద గుడ్‌న్యూస్‌ అని ఫించ్‌ తెలిపాడు. మ్యాక్స్‌వెల్‌ ఈ పిచ్‌లోనైనా భారీ షాట్లు ఆడగలడు. అతను క్రీజులో ఉన్నంత సేపు స్కోరుబోర్డుపై పరుగుల వరద పారుతూనే ఉంటుందని ఆసీస్‌ కెప్టెన్‌ పేర్కొన్నాడు. ఇక జట్టులోని ఇతర బ్యాట్స్‌మెన్స్‌ విఫలమవడం తమను కలవరపెడుతుందని, భారత్‌ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఏదిఏమైన తొలి టి20 విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని, అదే జోరును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించి భారత్‌ గడ్డపై తొలి టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంటామని ఫించ్‌ ధీమా వ్యక్తం చేశాడు.
రోహిత్‌ బ్యాట్‌ ఝుళిపించాలి..
భారత స్టార్‌ ఓపెనర్‌, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఆస్ట్రేలితో ఆదివారం జరిగిన మొదటి టి20లో ఘోరంగా విఫలమయ్యాడు. అతని సహచరుడు శిఖర్‌ ధావన్‌ బదులు ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా కెఎల్‌ రాహుల్‌ బరిలో దిగాడు. రాహుల్‌ ధాటిగా ఆడిన రోహిత్‌ మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. 8 బంతులు ఆడిన రోహిత్‌ 5 పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ కీలక మ్యాచ్‌లోనైనా రోహిత్‌ నిలకడైన బ్యాటింగ్‌తో భారత్‌కు శుభారంభం అందించాలని, అతడు కనీసం 10 ఓవర్లు అయినా పిచ్‌పై నిలబడాలని, అప్పుడే టీమిండియా భారీ స్కోరు సాధించగలదని అందరి అంచనా. మరోవైపు కెఎల్‌ రాహుల్‌ తిరిగి ఫామ్‌ను అందుకోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. గత కొంత కాలంగా విఫలమవుతున్న రాహుల్‌ ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇండియా ఎ తరఫున ఆడిన రాహుల్‌ ఆ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేశాడు. అక్కడి నుంచి నేరుగా ఈ ఆసీస్‌ సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. వరల్డ్‌ కప్‌ జట్టులో కెఎల్‌ రాహుల్‌కు కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆసీస్‌ సిరీస్‌లో రాణిస్తే ప్రపంచకప్‌ జట్టులో ఇతని స్థానం మరింతగా బలపడుతుంది.
పంత్‌, కార్తిక్‌ తేల్చుకోవాలి..
ఇక ప్రపంచకప్‌ జట్టులో రెండో వికెట్‌ కీపర్‌ స్థానం కోసం యువ సంచలనం రిషభ్‌ పంత్‌కి, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తిక్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ సిరీసే వారిద్దరికి చివరి అవకాశం. ఇప్పటికే మహేంద్ర సింగ్‌ ధోనీ తన స్థానాన్ని భర్తీ చేసుకోగా.. రెండో వికెట్‌ కీపర్‌ కోసం ఈ ఇద్దరూ పోటీలో ఉన్నారు. ఇక కార్తిక్‌ కంటే పంత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. కార్తిక్‌ను కేవలం రెండో కీపర్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నా.. పంత్‌కు బ్యాట్స్‌మన్‌గా కూడా జట్టులో తీసుకునే చాన్స్‌ ఉంది. ఇక ఇద్దరూ కూడా కొంత కాలంగా మంచి ప్రదర్శనలు చేస్తుండడంతో సెలెక్టర్ల పనీ మరింత కఠినమైంది. ఎవర్నీ ఎంపిక చేయాలో ఎవరిని చేయకూడదో తేల్చుకోలేక పోతున్నారు. గత మ్యాచ్‌లో ఇద్దరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు. పంత్‌ (3) పరగులు చేస్తే.. కార్తిక్‌ (1)కే ఆవుటయ్యాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఇద్దరూ రాణించి భారత్‌కు అండగా ఉంటారని భారత సారథి కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా బ్యాటింగ్‌లో విఫలమైన బంతితో మాత్రం మాయ చేశాడు. తక్కువ స్కోరురు సైతం కాపాడుకునేందుకు బుమ్రాతో కలిసి అద్భుతంగా పోరాడాడు. కఠిన సమయంలో పొదుపుగా బౌలింగ్‌ చేసి తన సత్తా చాటాడు. తొలి మ్యాచ్‌లో కృనాల్‌ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు. చాలా సార్లు బ్యాట్‌తో కూడా మెరిసిన కృనాల్‌ రెండో టి20లోనూ రాణిస్తాడని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక వైజాగ్‌ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన యువ బౌలర్‌ మయాంక్‌ మార్కండే కెప్టెన్‌ కోహ్లీ ప్రశంసలు పొందాడు. నాలుగు ఓవర్లు వేసిన మయాంక్‌ మార్కండే (7.75) సగటుతో 31 పరుగులు ఇచ్చాడు. వికెట్‌ లభించకపోయినా మార్కండే మంచి ప్రదర్శన చేశాడని మ్యాచ్‌ అనంతరం కోహ్లీ అన్నాడు.
బౌలర్లే కీలకం..
వైజాగ్‌ మ్యాచ్‌లో తక్కువ స్కోరును సైతం కాపాడుకునేందుకు భారత బౌలర్లు అద్భుతంగా పోరాడారు. చివరి కంఠం వరకు ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. ముఖ్యంగా భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చిరస్మరణీయ బౌలింగ్‌తో మరోసారి ఔరా అనిపించుకున్నాడు. భారత్‌ నిర్ధేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ మ్యాచ్‌ చివరి బంతికి ఛేదించింది. అయితే ఆ మ్యాచ్‌లో విజయం కోసం చివరి ఓవర్లో 14 పరుగుల చేయాల్సిన ఆసీస్‌ను కమ్మిన్స్‌, జయ్‌ రిచర్డ్‌సన్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో గెలిపించారు. ఆ ఆఖరి ఓవర్‌ వేసిన ఉమేశ్‌ యాదవ్‌ భారీ స్థాయిలో విమర్శులు ఏదుర్కొన్నాడు. ఇక బెంగళూరు మ్యాచ్‌లో ఉమేశ్‌ ఆడటం అనుమానమే. అతని స్థానంలో సిద్దార్థ్‌ కౌల్‌ లేదా విజయ్‌ శంకర్‌లలో ఎవరైన ఒకరే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో 19 ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 2 పరుగులే ఇచ్చి మ్యాచ్‌పై ఆశలు రేపాడు. కానీ చివరి ఓవర్‌ వేసిన ఉమేశ్‌ ఏకంగా 14 పరుగులు ఇచ్చి టీమిండియా ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. ఓవరాల్‌గా తొలి టి20లో భారత బౌలర్లు గొప్ప ప్రదర్శనలు చేశారు. పటిష్టమైన ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను హడలెత్తించారు. మంచి లైన్‌ అండ్‌ లెన్త్‌తో బౌలింగ్‌ చేస్తూ మంచి ఫలితాలు రాబట్టారు. ముఖ్యంగా బుమ్రా 4 ఓవర్లలో 16 పరగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ప్రదర్శన మొత్తం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మరోవైపు కృనాల్‌ పాండ్యా కూడా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఇక యాజువేంద్ర చాహల్‌ తెలివైన బంతితో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ను పల్టీ కొట్టించి భారత్‌ను మ్యాచ్‌లో నిలిపాడు. యువ బౌలర్‌ మయాంక్‌ మార్కండే సైతం మంచి ప్రదర్శన చేశాడు. మొత్తంగా భారత బౌలింగ్‌ విభాగం మరోసారి సత్తా చాటితే భారత్‌కు ఆఖరి మ్యాచ్‌లో విజయం ఖాయమనే చేప్పాలి.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments