24 గంటల్లో మరో 1,141 మంది కరోనాకు బలి
దేశంలో ఒక్కరోజే 86,052 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ
58 లక్షలు దాటిన సంఖ్య
47.50 లక్షల మంది రికవవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుం ది. వరుసగా ఐదవ రోజు కూడా 90 వేలమార్క్ దిగువ కు కొత్త కేసులు వెలుగు చూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 58 లక్షలు దాటింది. కరోనా కారణంగా నిత్యం దాదాపు 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 92 వేలు దాటింది. అదే విధంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 47 లక్షలు దాటి దూసుకెళ్తుంది. ఇక గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,052 మందికి కరోనా సోకింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 58,18,570కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 1,141 మంది కరోనా కారణంగా బలయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 92,290 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరో గ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.59 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. కొవిడ్ 19 తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది. కాగా, 24 గంటల్లో 81,177 మంది కరోనాను జయించారు. కొత్త రికవరీలతో కలిపి శుక్రవారం ఉదయం నాటికి 47,56,164 మంది మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. రికవరీ రేటు 81.74 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో 9,70,116 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో ఈ సంఖ్య 16.67 శాతం మాత్రమేనని మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టు 7న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలు దాటింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో, బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. మృ తుల సంఖ్యలో మాత్రం భారత్ మూడవ స్థానంలో కొనసాగుతుంది. రికవరీల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. కాగా, భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. గురువార ఒక్కరోజే రికార్డుస్థాయిలో 14,92,409 పరీక్షలు చేపట్టారు. ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 6,89,28,440 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహిస్తుండడంతో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయట పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది.
మహారాష్ట్రలో 34 వేలు దాటిన మృతులు
మహారాష్ట్రలో కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. మొత్తంబాధితులు 13 లక్షలకు చేరువ కాగా, మృతుల సంఖ్య 34 లక్షలు దాటింది. 24 గంటల్లో 19,164 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 459 మంది మత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 34,345కు చేరగా, కేసు ల సంఖ్య 12,82,963కు పెరిగింది. తమిళనాడులో 24 గంటల్లో 66 మంది మరణించగా, కొత్తగా 5,692 మందికి వైరస్ సోకింది. మొత్తం మృతుల సంఖ్య 9,076కు, బాధితుల సంఖ్య 5,63,691కి చేరింది. కర్నాటకలో కొత్తగా 65 మరణాలు సంభవించగా, 7,710 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 8,331కి, కేసుల సంఖ్య 5,48,557కు చేరింది. ఢిల్లీలో తాజాగా 3,834 మందికి వైరస్ సోకిం ది. 24 గంటల్లో 36 మంది మరణించారు. దీంతో మృ తుల సంఖ్య 5,123కు, బాధితుల సంఖ్య 2,60,623కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 52 గంటల్లో 51 మంది ప్రాణా లు కోల్పోగా, మొత్తం మృతులు 5,558కి చేరారు. రాష్ట్రంలో కొత్తగా 7,855 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 6,54,385కు చేరింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం మృతులు 5,366 కాగా, కొత్తగా 67 మంది మ రణించారు. 4,591 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు 3,74,277 మంది కరోనా బారిన పడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం మృతులు 4,606 కాగా, తాజాగా62 మంది చనిపోగా, మొత్తం 2,37,869 మందికి వైరస్ సోకింది. గుజరాత్‌లో మొత్తం మృతులు 3,381 కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,28,787 కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 1,408 మందికి వైరస్ సోకింది. పంజాబ్‌లో మృతుల సంఖ్య 3,066 నమోదు కాగా, ఒక్క రోజులో 76 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో మృతుల సంఖ్య 2,122గా ఉండగా, మొత్తం 1,15,361 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,397 నమోదు కాగా, మొత్తం బాధితుల సంఖ్య 1,22,720కి చేరింది. హర్యానాలో మొత్తం మృతులు 1,255 కాగా, బాధితుల సంఖ్య 1,18,554గా, జమ్మూకశ్మీర్‌లో మొత్తం మరణాలు 1,084 కాగా, బాధితుల సంఖ్య 68,614గా నమోదైంది.
92,290 మంది మృతి
RELATED ARTICLES