సిబిఐ విచారణలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ, మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థ ముందుకు : వందలాదిమంది పోలీసుల మోహరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ, మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం ఆదివారం ఉదయం సెం ట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ముందు హాజరయ్యారు. కాగా, అధికారులు ఆయనను సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. లిక్కర్ పాలసీతోపాటు, దానిపై వచ్చిన విమర్శలు, ఆరోపణలపైన కూడా కేజ్రీవాల్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. సిబిఐ ప్రధాన కార్యాలయానికి బయలుదేరే ముందు ఐదు నిమిషాల నిడివిగల వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అనంతరం రాజ్‌ఘాట్ వద్ద గాంధీ స్మారకాన్ని సందర్శించారు. ఆయన వెంటనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రివర్గంలోని కొంత మంది సభ్యులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి కేజ్రీవాల్ సుమారు 11 గంటల ప్రాంతం లో సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వందలాదిగా పోలీసులు మోహరించి ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రేణులు నిరసనలకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిబిఐ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి, కైలాశ్ గెహ్లాట్, ఆప్ అధికార ప్రతినిధి అదిల్ అహమ్మద్ ఖాన పార్టీ ప్రధాన కార్యదర్శి పంకజ్ గుప్తా, కొంత మంది మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనీసం 1,500 మందిని పోలీసులు అరెస్టు చేశారని ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇలావుంటే, విచారణ సమయంలో కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు ఆయనకు కొంత సేపు భోజన విరామాన్ని ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఆయన మయటకు వెల్లడానికి నిరాకరించినట్టు తెలుస్తున్నది. కేంద్రంలోని బిజెపి సర్కారు తనను చూసి భయపడుతున్నదని, అందుకే, అరెస్టు చేయాల్సిందిగా ఇప్పటికే సిబిఐని ఆదేశించిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసిన విషయం తెలిసిదే. దీనితో ఆయన ఫిబ్రవరి 28న తన పదవికి రాజీనామా చేశారు.