రాఫెల్ ఒప్పందంపై పార్లమెంట్‌కు
కాగ్ రిపోర్టు సమర్పణ
జాడలేని అసమ్మతి నోటు
ప్రస్తావనే లేని ఆఫ్‌సెట్ కాంట్రాక్టు
సావరిన్ గ్యారంటీకి బదులు ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ కంపెనీ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు మోడీ ప్రభుత్వ చేసుకున్న ఒప్పందం ధర 2007లో యుపిఎ సంప్రదించిన ధర కన్నా 2.86 శాతం చౌక అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక పేర్కొంది. వివాదాస్పద లావాదేవిపై కాగ్ నివేదికను బుధవారం వెలువరించింది. ధరల పూర్తి వివరాలు చెప్పకుండానే భారత వాయుసేనకు ఇంజినీరింగ్ మద్దతు ప్యాకేజీ, పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ విషయంలో ఒప్పందం 6.54 శాతం అధికమని కూడా పేర్కొంది. కాగా 2007 ఆఫర్‌లో పేర్కొన్న శిక్షణ ఖర్చుల కన్నా ఇప్పుడు శిక్షణ ఖర్చులు 2.68 శాతం ఎక్కువ అని తెలిపింది. ఈ నివేదికను బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో 126 విమానాల కొనుగోలు డీల్‌తో పోల్చుకుంటే కొత్త ఒప్పందం భారత్ అవసరాలకు తగినట్లు మార్పులు చేసిన 36 యుద్ధ విమానాలు చౌక అని తేల్చింది. ఫ్రాన్స్ ప్రభుత్వం సావరిన్ గ్యారంటీకి బదులు ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ సెట్లింగ్ చేసుకున్న లోపాన్ని కూడా కాగ్ పేర్కొంది. గ్యారంటీలు లేనందువల్ల దస్సాల్ట్ లబ్ధి పొందిందని పేర్కొంది. కాగా ఆఫ్‌సెట్ పార్ట్‌నర్స్ అం శంలో మాత్రం కాగ్ మౌనం దాల్చింది. అదే కీలక పాయింట్‌పై కాంగ్రెస్ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దాడి చేస్తోంది. అనిల్ అంబానీ గ్రూపుకు ఆఫ్‌సెట్ కాంట్రాక్టు దక్కడంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. పార్లమెంటులో కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ‘ దీంతో కాంగ్రెస్, ప్రతిపక్షాల అబద్ధాలు రట్టయ్యాయి’ అని వ్యాఖ్యానించారు. 2016లో చేసుకున్న ఒప్పందం ధర కన్నా, వేగంగా విమానాలు అందించడం, మెరుగైన నిర్వహణ, ఖర్చు తక్కువగా పెరగడం వంటి విషయాల్లో ఎంతో చౌక అన్న విషయాన్ని కాగ్ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు. 2007 యుపిఎ సంప్రదింపు ధర కన్నా ఎన్‌డిఎ ప్రభుత్వం కుదుర్చుకున్న ధర 17.08 శాతం చౌక అని కాగ్ నివేదిక పేర్కొంది. తన 157 పేజీల నివేదికలో కొత్త ఒప్పందంలో ఆయుధాల ప్యాకేజీ 1.05 శాతం చౌక అని పేర్కొంది. ధరల పరిస్థితి చూసినప్పుడు కొత్త ఒప్పందం 2.86 శాతం చౌక అని తెలిపింది. కాగా ఇదివరలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గతంలో యుపిఎ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కన్నా 9 శాతం చౌక అన్నారు. మరోప్రక్క కాంగ్రెస్ ఒక్కో యుద్ధ విమానంపై రూ. 1,600 కోట్లు పెరిగాయని ఆరోపిస్తోంది. యుపిఎ కాలంలో కుదురుకున్న రూ. 520 కోట్ల కన్నా ఇది ఎక్కువ అని పేర్కొంది. ‘కాగ్ నివేదిక విలువలేనిదని, దానిని తాను ‘చౌకీదార్ ఆడిటర్ జనరల్ రిపోర్టు’ అంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారమే అన్నారు. సూటిగా చెప్పాలంటే అది ప్రధాని నరేంద్ర మోడీ రిపోర్టని కూడా అన్నారు. ‘చౌకీదార్ కోసం, చౌకీదార్ తరఫున, చౌకీదారే చేసుకున్న నివేదిక’ అని ఎద్దేవా చేశారు.