పోలాండ్‌లో రెండవ ప్రపంచ యుద్ధం
వార్సా: పోలాండ్ రాజధాని వార్సాలో రెండవ ప్రపంచ యుద్ధం 85వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. పోలాండ్‌ను ఆక్రమించిన జర్మనీ నాజీ సేనాలు, అక్కడ బాంబుల మోత మోగించడంతో ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. జర్మనీ సేనలు 1939 సెప్టెంబర్ 1న మొదట దాడి చేసిన వైలన్ పట్టణంలో పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ డుడా నివాళి అర్పించారు. బాల్టిక్ సముద్రంలోని వెస్టర్ప్లేట్ ద్వీపకల్పంలోని మిలిటరీ ఔట్‌పోస్ట్‌పై జర్మనీ యుద్ధ నౌక బాంబులు కుర్పించిన ప్రాంతంలో నిర్మించిన యుద్ధ స్మృతి వద్ద ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్, రక్షణ మంత్రి వాడీస్లా కొసినియాక్ కామిస్ట్లు పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఆ ప్రాంతంలో జర్మనీ సైన్యానికి లొంగిపోకుండా ఏడు రోజుల పాటు పోలాండ్ సైన్యం వీరోచిత పోరాటం చేసింది. ఐదేళ్ళ జర్మనీ దురాక్రమణలో 60 లక్షల పోలాండ్ పౌరులు, అందులో 30 లక్షల యూధులు ప్రాణాలు కోల్పోయారు. మౌలిక వసతులు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో కూడా ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. పోలాండ్‌లో గత మితవాద ప్రభుత్వం నష్టపరిహారంగా జర్మనీ 1.3 ట్రిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కొంత పరిహారం ఇచ్చి, రెండు పొరుగుదేశాల సంబంధాలు మెరుగుపరచాలని కోరుతోంది.