పసలేని ప్రభుత్వ వాదన
అన్ని డిపోలు నష్టాల్లోనే
ప్రజాపక్షం/ ఖమ్మం : ఆర్‌టిసి కార్మికుల సమ్మె 52వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసికి సంబంధించి ఏమి నిర్ణయం తీసుకుంటుంది… తదనంతర పరిణామాలు ఏమిటన్నది అటు ప్రభుత్వానికి, ఇటు కార్మికులకు అర్థం కానీ స్థితి. పూర్తిగా ప్రైవేటు పరం చేస్తే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకోవాల్సి వస్తుందన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌టిసి కార్మికులు లేకుండా ఆర్‌టిసిని నడపడం సాధ్యమయ్యే పనికాదు. 50 శాతం రూట్లను ప్రైవేటు పరం చేసినా మిగిలిన 50 శాతం నడిపేందుకు కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా నిర్వహించడం ఎలా అనేది ప్రభుత్వానికి అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం నడుపుతున్న విధంగానే తాత్కాలిక కార్మికులతో బస్సులను నడిపితే ఏమిటన్నది కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం అన్ని డిపోల్లోనూ 70 నుంచి 80 శాతం బస్సులు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ ప్రచారం నిజమైతే గతంలో వచ్చిన ఆదాయంలో సగం ఆదాయం కూడా ఎందుకు రావడం లేదన్నది ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం వరకు తాత్కాలిక కార్మికులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవచ్చాయి. తాత్కాలిక కండక్టర్లు కూడా సగం మందికి టిమ్ (టిక్కెట్ ఇష్యూయింగ్ మిషన్) ఇస్తున్నారు. దీనిని ఉపయోగించేటప్పుడు డబ్బులు తీసుకుని టిక్కెట్ ఇవ్వకుండా ఉండడం సాధ్యం కాదు. మిగిలిన సగం మంది టిక్కెట్లను ఇస్తున్నారు. వీరు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఇచ్చిన టిక్కెట్లనే తిరిగి ఇస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. తాత్కాలిక కార్మికుల విషయాన్ని పక్కన పెడితే కొన్ని డిపోల్లో విధుల్లో ఉన్న అధికారులు సైతం లెక్కలను తారుమారు చేస్తున్నారని తెలుస్తుంది. ఖమ్మం జిల్లా మధిర డిపోలో గతంలో 62 బస్ సర్వీసులు నడిచేవి. ప్రతి రోజు సగటున 7లక్షల 80వేల రూపాయల ఆదాయం వచ్చేది. సమ్మె కాలంలో మధిర డిపోలో 54 బస్ సర్వీసులు నడుపుతున్నారు. ఇందుకు 54 మంది తాత్కాలిక కండక్టర్లు, 34 మంది ప్రైవేటు డ్రైవర్లు, 21 అద్దె బస్సుల డ్రైవర్లు విధులను నిర్వహిస్తున్నారు. కానీ ఆదాయం నాలుగు లక్షల రూపాయలకు మించి రావడం లేదని డిపో మేనేజర్ తెలిపారు. కేవలం ఎనిమిది బస్సులు మాత్రమే తగ్గితే నాలుగు లక్షల రూపాయల ఆదాయం ఎందుకు కోల్పోవాల్సి వస్తుందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం రీజియన్‌లో గతంలో రోజుకు 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు 25 లక్షల రూపాయలకు మించి ఆదాయం రావడం లేదని ఆర్‌టిసి వర్గాలే పేర్కొంటున్నాయి. ఖమ్మం రీజియన్ పరిధిలో ఆరు డిపోలు ఉండగా సుమారు 2700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం 602 బస్సులకు గానూ 500 పైచిలుకు బస్సులను నడుపుతున్నారు. గతంలో ప్రతి రోజు ఆర్‌టిసి బస్సులు 1.70 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చగా ఇప్పుడు 520 బస్సులు తిరుగుతున్నా లక్ష పై చిలుకు ప్రయాణికులను మాత్రమే గమ్య స్థానాలకు చేర్చుతున్నారు. ఈ లెక్కలన్నీంటిని గమనించిన ప్రభుత్వం ఆర్‌టిసి కార్మికులతో కాకుండా ప్రైవేటు కార్మికులతో సగం బస్సులను నడిపినా ప్రమాదమేనన్న వాదనలు వినపడుతున్నాయి. ఎటు నుంచి ఎటు చూసినా ఆర్‌టిసి కార్మికులను తప్పనిసరిగా విధుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే మొత్తం ఆర్‌టిసి రూట్లను ప్రైవేటుపరం చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం సమ్మె పట్ల నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నది. కార్మికులు భేషరతుగా విధుల్లోకి చేరతామని ప్రకటించిన విధుల్లోకి తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తుంది. ప్రభుత్వ వైఖరితో మొత్తం రవాణా వ్యవస్థ నిర్వహణ డోలాయమానంలో పడింది.