కరోనా సెకండ్‌వేవ్ ఇంకా తొలగిపోలేదు
కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఇంకా తొలగిపోలేదని, ఎనిమిది రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఉద్ధృతరూపం కొనసాగుతోందని కేం ద్రం హెచ్చరించింది. కరోనా వ్యాప్తి రేటును తెలియజేసే ఆర్- ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేటు) 8 రాష్ట్రాల్లో 1 కన్నా ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశం లో కరోనా పరిస్థితిపై నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు మంగళవారం మాట్లాడారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో గతవారంలో పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదైనట్టు వెల్లడించారు. కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో గత నాలుగు వారాలుగా రోజువారీ కేసుల పెరుగుదల భారీగా కొనసాగుతోందని తెలిపారు. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో 49.85 శాతం ఒక్క కేరళలోనే నమోదయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ మే నెలతో పోలిస్తే జులై నెలలో రెట్టింపు సంఖ్యకన్నా అధికంగా ఉందని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ ప్రభావంతో కేసులు పెరుగుదల కొనసాగుతోందని నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వికె పాల్ తెలిపారు. దేశంలో డెల్టా వేరియంట్ ఓ ప్రధానమైన సమస్యగా మారిందన్నారు. ఆర్ ఫ్యాక్టర్ పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ నంబర్ 0.6 లేదా అంతకన్నా తక్కువగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ నంబర్ 1 కన్నా అధికంగా ఉంటే వైరస్ వ్యాప్తి మరింతగా ఉండే అవకాశం ఉందనేందుకు సూచిక అన్నారు. హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలో ఆర్ ఫ్యాక్టర్ 1కన్నాఎక్కువగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో కేసుల తగ్గుదల ట్రెండ్ కనబడుతోందని, అలాగే, బెంగాల్, నాగాలాండ్, హరియాణా, గోవా, దిల్లీ, జార్ఖండ్‌లలో మాత్రం ఆర్ ఫ్యాక్టర్ 1గా ఉన్నట్టు తెలిపారు. ఆర్ నంబర్ 1కన్నా ఎక్కువగా ఉంటే.. కేసుల సంఖ్య పెరుగుతోందని, నియంత్రించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్‌లలో ఆర్ ఫ్యాక్టర్ నంబర్ సగటున 1.2గా ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ రోజుకు దాదాపు 4.7లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలిపారు. కాగా, ఆర్ వాల్యూ అంటే.. రిప్రొడక్టివ్ రేట్ వాల్యూ. వైరస్ సంక్రమణ రెట్టింపు అవుతున్న తీరును ఈ పద్ధతిలో అంచనా వేస్తారు. ఇదో గణిత శాస్త్ర విధానంలో ఉంటుంది. సాధారణంగా ఆర్ వాల్యూ ఒకటి కన్నా తక్కువగా ఉంటే అప్పుడు వైరస్‌తో ముప్పు లేదు. కానీ ఒక పాయింట్ దాటితే అప్పుడు ఆర్ వాల్యూతో ప్రమాదమే ఉంటుంది. ఉదాహరణకు ఆర్ విలువ 0.90గా ఉంటే, అప్పుడు 100 మంది వల్ల 90 మందికి వైరస్ సంక్రమించినట్లు అంచనా. ఒకవేళ ఆర్ వాల్యూ ఒకటి దాటితే, అప్పుడు వైరస్ విజృంభిస్తున్నట్లు భావిస్తారు. చెన్నైకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఆర్ వాల్యూను ఇటీవల అంచనా వేసింది. జూన్ 30 నుంచి జూలై వరకు ఆర్ వాల్యూ పెరిగినట్లు ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు. దీంతో మళ్లీ ఇండియాలో కరోనా కలవరం మొదలైంది.
8 రాష్ట్రాల్లో ఆందోళనకరం!
RELATED ARTICLES