భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతం కాగా, ఇద్దరు జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పరిధిలో గల కిష్టారం పోలీస్‌స్టేషన్ సమీప గ్రామాల్లో డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడటంతో ఒక్క సారిగా ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. తొలుత మావోయిస్టులు కాల్పులు జరపడంతో ప్రాణ రక్షణ కోసం బలగాలు సైతం కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరితో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం రాయపూర్ తరలించారు.
కొనసాగుతున్న కూంబింగ్
మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాల కోసం వారు వచ్చే అవకాశం ఉండటంతో వాటిని అక్కడి నుంచి తరలించారు. సుమారు 50 మందికి పైగా ఉన్న దళం కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. మిగతా వారు అడవుల్లోకి పారిపోవడం వారి కోసం అనువనువునా గాలిస్తున్నారు. శీతాకాలం కావడం చెట్ల పొదలు దట్టంగా పెరిగి ఉండటంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తుగానే ల్యాండ్ మైన్లు పెట్టే ప్రమాదం ఉండటంతో ఆ దిశగా కూడా ఆలోచన చూస్తూ బలగాలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలోని చర్ల మండలంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ఆ పోస్టర్లలో రాసుంది. డిసెంబల్ 2 నుంచి 8 వరకు జరిగే పిఎల్‌జిఏ వారోత్సవాలను జయప్రదం చేయాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 8 కంటే ముందు ఒక్క రోజు అయిన 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అప్రమత్తమైన మూడు రాష్ట్రాల పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. వాహనాల రాకపోకలపై దృష్టి సారించారు. గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటవీ గ్రామాల్లోనికి వచ్చిపోయే రహదారులపై దృష్టి కేంద్రీకరించిన బలగాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రచారాల్లో ఉన్న నాయకుల్లో సైతం పెద్ద ఎత్తున ఆందోళలు మొదలయ్యాయి.