రైతులతో ప్రభుత్వ చర్చలు అసంపూర్ణం
ఈనెల 8న మరోదఫా చర్చలు
కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన
సంఘీభావంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు
న్యూఢిల్లీ: దేశ వ్యవసాయ రంగం అభివృద్ధికి మూడు కొత్త సాగు చట్టాల వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను ప్రభుత్వం ఏకరువు పెట్టినప్పటికీ, రైతు సంఘాలు వాటి రద్దుకే పట్టుపట్టడంతో కేంద్ర మంత్రులు, రైతు సంఘాల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. దీంతో జనవరి 8న జరిగే తదుపరి సమావేశంలోనైనా ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం తనకుందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అయితే రెండు పక్షాల నుంచి ప్రయత్నం జరిగితేనే ఒక పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టంచేశారు. రైతు నాయకులు చట్టాల రద్దుకే అంటిపెట్టుకోవడంతో సోమవారం నాటి సమావేశం ఫలితం తేలలేదన్న తోమర్, చర్చలు ముందుకు సాగడానికి చట్టాల మీద క్లాజులవారీ చర్చ జరగాలని ప్రభు త్వం కోరుతోందన్నారు. రైతు సంఘాలు మాత్రం సమస్య పరిష్కారానికి ప్రభుత్వ “అహం” (ఈగో ప్రాబ్లం) అడ్డుగా నిలుస్తోందని ఆరోపించాయి. తమ ప్రధాన డిమాండ్లయిన చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత గురించి ప్రభుత్వానికి కనికరం కలగడం లేదన్నాయి. సమావేశం మొద టి నుంచీ రైతు నాయకులు వివాదాస్పద చట్టాల రద్దుకే కట్టుబడి ఉన్నారు. గంటన్నర చర్చల తర్వాత రెండు పక్షాలు దీర్ఘ విరామాన్ని తీసుకున్నాయి. ఈ సమయంలో రైతు సంఘాల ప్రతినిధులు గతంలోలాగే లంగర్ నుంచి వచ్చిన భోజనమే తిన్నారు. కేంద్ర మంత్రులు మాత్రం డిసెంబర్ 30 నాటిలా కాకుండా, ఈసారి రైతు నాయకులతో కలిసి భోజనం చేయలేదు. దాదాపు రెండు గంటల విరామంలో మంత్రులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. సాయంత్రం 5.15కు చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అయితే చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ చుట్టే తిరగడంతో చర్చల్లో పురోగతి కనిపించలేదు. ప్రభుత్వం అంతర్గతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత, మళ్లీ రైతు సంఘాలతో చర్చలకు వస్తామని చెప్పిందని రైతు నాయకులు వెల్లడించారు. తర్వాతి కార్యాచరణ గురించి రైతు నాయకులు మంగళవారం సమావేశం కానున్నారు. సోమవారం నాటి చర్చల్లో రెండు పక్షాలు కూడా మరో ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత గురించి చర్చించనే లేదు.
చర్చలే పరిష్కారానికి మార్గం
వేలాది రైతులు ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవాళ్లు 40 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. దేశ రాజధాని పరిసరాల్లో తీవ్రమైన చలి పరిస్థితులకు తోడు, రెండు రోజులుగా నిరసన స్థలాలు భారీ వర్షం, నీటిముంపునకు గురైనప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం చట్టాల ప్రయోజనాల గురించి చెప్పడం, రైతు సంఘాలు చట్టాలు రద్దు చేయమనడంతో ప్రతిష్టంభన కొనసాగుతోందని మహిళా కిసాన్ అధికార్ మంచ్‌కు చెందిన కవితా కురుగంటి అభిప్రాయపడ్డారు. మూడు చట్టాల రద్దుకు తక్కువగా మాకేదీ అక్కర్లేదని భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవాల్) అధ్యక్షుడు బల్‌బీర్ సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు. ఇక సమావేశం తర్వాత తోమర్ విలేకర్లతో మాట్లాడారు. చట్టాల్లో అభ్యంతరం ఉన్న అంశాలను తమకు వివరించాలని తోమర్ రైతులకు సూచించారు. అయితే చర్చలు సుహృద్భావపూర్వక వాతావరణంలో జరిగాయన్నారు వ్యవసాయ మంత్రి. ప్రభుత్వం, రైతులకు మధ్య విశ్వాస లోపం వల్ల ప్రతిష్టంభన ఏర్పడిందా అన్న ప్రశ్నకు, అలాంటిదే ఉంటే చర్చలు కొనసాగేందుకు రైతు సంఘాలు అంగీకరించేవే కాదని అన్నారు తోమర్. మరి తర్వాత సమావేశం కూడా మరో తేదీకి దారితీస్తుందా అన్నప్పడు, ఎవరికి తోచిన ఆలోచన వాళ్లు చేసుకోవచ్చు. కానీ చర్చలు కొనసాగడం అన్నది పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకాన్ని సూచిస్తుందని, తాను దానినే విశ్వసిస్తున్నట్లు తోమర్ స్పష్టంచేశారు. చట్టాలకు మద్దతు ఇస్తున్న ఇతర రైతు బృందాలతో సమాంతర చర్చల గురించి అడిగిన మరో ప్రశ్నకు, రైతులందరి ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తోమర్ బదులిచ్చారు. 2020 సెప్టెంబర్‌లో అమలులోకి తెచ్చిన కొత్త చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలని ప్రభుత్వం వాదిస్తోంది. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచడంలో తోడ్పడతాయన్నది ప్రభుత్వం మాట. అయితే ఇవి కనీస మద్దతు ధర, మండీ విధానాన్ని బలహీనపరిచి, తమను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆందోళన అర్థరహితమని, చట్టాలను వెనక్కి తీసుకోలేమని ప్రభుత్వం చెప్తోంది.
చనిపోయినవారికి శ్రద్ధాంజలి
విజ్ఞాన్ భవన్‌లో 41 రైతు సంఘాల ప్రతినిధులతో జరుగుతున్న చర్చలకు ప్రభుత్వం తరఫున కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే, వాణిజ్య, ఆహార మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు శ్రద్ధాంజలితో సమావేశం మొదలైంది. మంత్రులు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా రైతు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు. డిసెంబర్ 30 నాడు ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఆరో విడత చర్చలు జరిగాయి. వీటిలో పంటల వ్యర్థాల దహనం విషయంలో నేరం నుంచి మినహాయింపు, విద్యుత్ సబ్సిడీల కొనసాగింపునకు సంబంధించి రెండు పక్షాలు ఒక ఉమ్మడి అభిప్రాయానికి వచ్చాయి. అయితే రైతుల ప్రధాన డిమాండ్లయిన చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ విషయం మాత్రం ఎటూ తేలలేదు. ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం కోసం ఆదివారం నాడు తోమర్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఇందులో ఒక మధ్యే మార్గాన్ని కనుక్కునేందుకు ఉన్న అవకాశాల గురించి చర్చించినట్లు సమాచారం. కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు రైతులకు మద్దతుగా వచ్చారు. కొన్ని రైతు సంఘాలు మాత్రం సాగు చట్టాలకు తమ మద్దతు తెలుపుతూ వ్యవసాయ మంత్రిని కలిశాయి.
వ్యాపారం కోసం రిలయన్స్ నాటకం
గత నెల ప్రభుత్వం చట్టాలకు ఏడు ఎనిమిది సవరణలు, కనీస మద్దతు ధరకు రాతపూర్వక హామీతో కూడిన ప్రతిపాదనలను రైతులకు పంపించింది. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోలేమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మధ్యలోనే పంజాబ్, హర్యానాల్లో నిరసన చేస్తున్న రైతుల మీద పోలీసుల చర్యను ఖండిస్తూ ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) ఒక వార్తా ప్రకటన జారీచేసింది. అంతేకాదు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు నిరసనలు, ధర్నాల మీద విధించిన నిషేధాన్ని కూడా ఎఐకెఎస్‌సిసి ఖండించింది. ఇంకా పంజాబ్, హర్యానా హైకోర్టులో రిలయన్స్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను “తన వ్యాపారాన్ని కాపాడుకునేందుకు ఆడుతున్న నాటకం”గా పేర్కొంది.
భారీ ఎల్‌ఇడి తెరలు, స్పీకర్ల ఏర్పాటు
మరింత మంది ఆందోళనలకు తరలివస్తున్న తరుణంలో వీలైనంత ఎక్కువమందికి చేరువయ్యేందుకు ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు దగ్గర భారీ ఎల్‌ఇడి తెరలు, స్పీకర్లను ఏర్పాటుచేశారు. ఇక రైతు సంఘాలు సమాచారం చేరవేసుకునేందుకు వాకీ టాకీలు కూడా అమర్చుకున్నారు. అలా భారీ ఎల్‌ఇడి తెరలు, లౌడ్ స్పీకర్లతో సింఘు నిరసన స్థలం హైటెక్ వాతావరణాన్ని సంతరించుకుంది. పెరుగుతున్న రైతులతో తమ ఉపన్యాసాలు కొంతమందే వినగలుగుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహణ బృందం తెలుసుకుంది. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రెండు 8*10 అడుగుల ఎల్‌ఇడి తెరలు ఏర్పాటుచేశారు. 10 కిలోమీటర్ల నిడివిలో వీలైనన్ని లౌడ్ స్పీకర్లను ఏర్పాటుచేశారు.
8న ఎనిమిదోసారి!
RELATED ARTICLES