మీకు న్యాయవిభాగమే లేదా?
పోలీసులను ప్రశ్నించిన ఢిల్లీ కోర్టు
కొత్త ఛార్జిషీటుకు 6వరకు గడువు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సి టీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్యకుమార్, ప్రభృతులపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఎలాంటి అవసరమైన అనుమతులు లేకుండానే ఛార్జిషీటు దాఖలు చేయడంపై పోలీసులను తప్పుపట్టింది. ‘ఒక ఛార్జిషీటును ఇలా ఎవరైనా దాఖలు చేస్తారా?’ అని ప్రశ్నించింది. అవసరమైన అనుమతులు పొందిన మీదటే అభియోగపత్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ పోలీసులకు ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ ఆమోదం లేకుండానే ఇలా చేయడం సరికాదని పేర్కొంది. ‘న్యాయశాఖ విభాగం నుంచి మీరు ఎలాంటి ఆమో దం పొందలేదు. అలా ఎందుకు ఛార్జిషీట్ దాఖలు చేశారని’ పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఢిల్లీ పోలీసులు బదులిస్తూ మరో 10రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు. అస లు ముందే ఆ పని ఎందుకు చేయలేదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ప్రశ్నించారు. ఆ తర్వాతనే ఈ కేసులో విచారణ గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. కన్హయ్య 2016 ఫిబ్రవరిలో జెఎన్‌యులో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు జనవరి 14వ తేదీన 1,200 పేజీలతో కూడిన ఛార్జిషీటును దాఖలు చేశారు. కన్హయ్యతోపాటు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, జమ్ము, కశ్మీర్‌కు చెందిన ఆక్యుబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రాయీ రసూల్, బషీర్ భట్, బషరత్ పేర్లు ఈ ఛార్జిషీట్లో పొందుపరిచారు. గతంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అధికార బిజెపికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. తాజా గా ఛార్జిషీటు దాఖలు చేయడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఐపిసిలోని 124ఎ, 120బి సెక్షన్ల కింద 2016 ఫిబ్రవరి 11న ఈ కేసు దాఖలైంది. ఈ ఛార్జిషీట్ విషయమై కన్నయ్యకుమార్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులకు కచ్చితంగా ధన్యవాదాలు తెలపాల్సిందేనని వ్యంగ్యంగా అన్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటివి తెరమీదకు తెస్తున్నారని, దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని చెప్పారు. ఉమర్ ఖలీద్.. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించడానికి నిరాకరిస్తూనే తప్పులను కప్పిపుచ్చుకోవడాకే ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని న్యాయస్థానంలో నిరూపించుకొంటామని ఖలీద్ ధీమా వ్యక్తం చేశారు.