ఎన్నికలపై ‘పంచాయతీ’ నిర్లక్ష్యం
డివిజన్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు కాని ఎలక్షన్ సెల్స్
శనివారం రాత్రి ఆదరబాదరాగా జిఒ జారీ
సోమవారం అధికారులకు అందిన ఉత్తర్వులు
అప్పటికే తొలివిడత ఎన్నికల ప్రక్రియ మొదలు
సిబ్బందిని ఎంపిక చేసే సరికి ఎన్నికలు ముగుస్తాయంటున్న ఉద్యోగులు
ప్రజాపక్షం / హైదరాబాద్ : ‘పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం, ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తి చేశాం’ అంటూ ఊదరగొట్టిన పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల డొల్లతనం బయటపడింది. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన పనులను చూసుకోవడానికి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అయినప్పటికీ డివిజన్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ఎన్నికల విభాగాలను( ఎలక్షన్ సెల్స్) ఏర్పాటు చేయలేదు. దీంతో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైన అనంతరం సంబంధిత వివరాలు ఎలా సేకరించాలి, ఎవరి వద్ద నుంచి సేకరించాలో తెలియక పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంలోనూ అధికారులు తలలు పట్టుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అప్పటికప్పుడు జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో, రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనరేట్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని, అధికారులను నియమించాలని నిర్ణ యం తీసుకున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా సిబ్బందిని మంజూరుచేస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఈ నెల 5వ తేదీన విడుదల చేసినట్లుగా ఉన్న జిఒ సోమవారం పంచాయతీ అధికారులకు అందింది. జిఒపై ఉన్న తేదీ ప్రకారం 5వ తేదీ సాయంత్రం విడుదల అయినప్పటికీ 6వ తేదీ ఆదివారం సెలవు కావడంతో అది సోమవారం పంచాయతీ అధికారులకు అందింది. హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విభాగానికి అదనంగా జిల్లా పంచాయతీ అధికారి క్యాడర్ గల ఒక అధికారిని, ఒక సూపరింటెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.