లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను త్వరగా ప్రకటించండి
ఆ తప్పిదమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం
గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ సమీక్షలో నేతలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలకు చాలా ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం కాంగ్రెస్ ఓటమికి ముఖ్యకారణాల్లో ఒకటని పలువురు అభ్యర్థులు తెలిపారు. భవిష్యత్తులో ఇలా కాకుండా పార్లమెంటు ఎన్నికల్లో కాస్త ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని కోరారు. గాంధీభవన్‌లో శుక్రవారం నుండి లోక్‌సభ నియోకజకవర్గాల వారీగా శాసనసభ అభ్యర్థులతో అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలపై సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్.సి.కుంటియా, టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తొలి రోజు ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్ లోక్‌సభ పరిధిలోని స్థానాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటించడంలో చాలా ఆలస ్యం జరిగిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిందని, అంతే కాకుండా తమ బలహీన తలను కూడా గమనించి సరిచేసుకోగలిగిందన్నారు.తమకు కనీసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా తిరిగేంత సమయం దొరకలేదని చెన్నూరు అభ్యర్థి వెంకటేశ్ నేత,పెద్దపల్లి అభ్యర్థి విజయరమణారావు తెలిపారు. కొన్ని గ్రామాల్లో ప్రచారం కూడా చేయలేకపోయామన్నారు. అభ్యర్థులు ఎవరో తెలియకపోవడంతో టిఆర్‌ఎస్ నేతలు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారని, కొన్ని చోట్ల కింది స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులను కూడా ప్రలోభాలతో తమ వైపునకు తిప్పుకున్నారని మరో అభ్యర్థి పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలోనైనా అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం జరగొద్దని కోరారు. తమ నియోకవర్గాల్లో కొందరు నాయకులు సహకరించలేదని కూడా ఫిర్యాదులు చేశారు.