రష్యాను దాటి మూడవ స్థానంలోకి భారత్
మరణాల సంఖ్యలో 8వ స్థానంలో ఇండియా
ఒక్క రోజే మరో 24,248 కేసులు, 425 మంది మృతి
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విపయతాండవాన్ని సృష్టించడంతో పాటు మరణ మృదంగాన్నీ మోగిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం రికార్డుస్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా నాల్గొవ రోజు కూడా 20 వేలకుపైగా మందికి కరోనా పాజిటివ్‌గా తేలడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క రోజే మరో 24,248 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబిజాతో భారత్ మూడో స్థానంలోకి చేరింది. దాదాపు 29లక్షల కేసులు, లక్షా 30వేల మరణాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 16లక్షల పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక 6లక్షల 80వేలతో మూడోస్థానంలో ఉన్న రష్యాను తాజాగా భారత్ దాటవేసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం నాటికి కేవలం 24 గంటల్లోనే మరో 24,248 పాజిటివ్ కేసులు రావడం మరింత భయాంతోళనలను కలిగిస్తోంది. దీంతో దేశంలో మొత్తం 6,97,413 మందికి మహమ్మారి సోకింది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. తాజాగా మరో 425 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 19,693కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే సాయంత్రానికికల్లా బాధితుల సంఖ్య 7 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 20 వేలు దాటింది. జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులతో భారత్ కొవిడ్19 మరణాల్లో ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో మొత్తం 2,53,287 యాక్టివ్ కేసులు ఉండగా, 4,24,432 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 60.85గా ఉన్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా, భారత్‌లో గడచిన ఐదురోజుల్లో 1,12,000 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఏ మేరకు వైరస్ విజృంభిస్తుందో అర్థమవుతోంది. అంతేకాకుండా కేవలం జూన్ నెలలోనే దేశంలో దాదాపు 4లక్షల పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో శరవేగంగా వ్యాప్తి
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలి కాలంగా నిత్యం 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లోనే 6,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఒక్కరోజులోనే రాష్ట్రంలో మరో 151 కొవిడ్ రోగులు మృతిచెందారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,06,619కి చేరగా, వీరిలో ఇప్పటి వరకు 8,822 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోనూ కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు నిత్యం ఐదువేల మంది కరోనా బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 4,150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 1,11,151కి చేరింది. దేశంలో లక్ష కేసులు దాటిన రెండో రాష్ట్రంగా నిలిచింది. కొత్తగా 60 మంది మృతి చెందగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 1,510 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసుల సంఖ్య లక్ష దాటనుంది. నిత్యం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 2,244 మందికి పాజిటివ్ రాగా, మొత్తం కేసుల సంఖ్య 99,444కు చేరింది. తాజాగా మరో 63 మంది కరోనా కాటుకు బలి కాగా, మొత్తం 3,067 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో కొత్తగా 18 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 1,943గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,037 మంది కరోనా బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 27,707కు చేరింది. కొత్తగా 12 మంది మరణించగా, మృతుల సంఖ్య 785కు చేరింది. మధ్యప్రదేశ్‌లో 608 మంది, రాజస్థాన్‌లో 456, కర్నాటకలో 372, తెలంగాణలో 295, ఆంధ్రప్రదేశ్‌లో 239 మంది మరణించారు. కేసుల విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 27,707 మంది, తెలంగాణలో 23,902 మంది, కర్నాటకలో 23,474 మంది, పశ్చిమ బెంగాల్లో 22,126, రాజస్థాన్‌లో 20,164, ఆంధ్రప్రదేశ్‌లో 20,019 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్‌లోనూ కేసుల సంఖ్య పది నుంచి 15 వేల మధ్య కేసులు నమోదయ్యాయి.
కోటి దాటిన పరీక్షలు
కొవిడ్ గుర్తించేందుకు పరీక్షలను పెంచామని, అందులో భాగంగా సోమవారం నాటికి భారత్‌లో కోటి పరీక్షలు దాటినట్లు భాతర వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) పేర్కొంది. సోమవారం ఉదయం నాటికి దేశంలో 1,00,04,101 నమూనాలను పరీక్షించామని, జులై 5వ తేదీ ఒక్క రోజే 1,80,596 పరీక్షలు చేసినట్లు శాస్త్రవేత్త, ఐసిఎంఆర్ మీడియా కోఆర్టినేటర్ డాక్టర్ లోకేష్ శర్మ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 1.105 పరీక్ష కేంద్రాలు ఉండగా, అందులో 788 కేంద్రాలు ప్రభుత్వానివని, మరో 317 ప్రైవేట్వని ఆయన చెప్పారు. నిత్యం పరీక్షల సామర్థ్యం చాలా వేగంగా పెరుగుతుందన్నారు. ఈ నెల 1వ తేదీ నాటికి 9 మిలియన్ మార్క్‌ను దాటగా ఇప్పుడు కోటి మార్క్‌ను దాటేశాయి.
7 లక్షల కేసులు..20 వేల మృతులు
RELATED ARTICLES