6 నుంచి 8 క్లాస్‌లకు నేటి నుంచే తరగతులు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ రాష్ర్టవ్యాప్తంగా పాఠశాలల్లో 6 నుండి 8వ తరగతి వరకు తరగతులను బుధవారం నుండి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం కె.చంద్రశేఖర్‌ రావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ తరగతుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 17.24 లక్షలు. ఇప్పటికే తొమ్మిదవ తరగతి నుండి ఎగువ తరగతులకు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలు చెప్పనున్నారు. దీంతో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లు, డిఇఒలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులతో మంగళవారం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌ నుండి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 6 నుండి 8వ తరగతి వరకు క్లాసులను వీలైన మేరకు బుధవారం నుండి లేదా మార్చి 1వ తేదీ లోగా ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ కమిటీలు సమావేశమై 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఉపాధ్యాయులు, విద్యార్థుల భద్రత కోసం తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలను మొదటిసారి ప్రారంభిస్తున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, ఎస్‌సి సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, బిసి సంక్షేమ కార్యదర్శి బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్‌ అహ్మద్‌, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?