భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
ప్రజాపక్షం/హైదరాబాద్ బంగాళాఖాతంలో ఈ నెల 6న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రం లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. కోస్తాం ధ్ర ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 6 నుంచి 12లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీగా, ఆదివారం పలు చోట్ల భారీగా, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కొత్తగూడెంలో 13, నల్లగొండ జిల్లా చందూరు 11, పుల్లెంల (నల్లగొండ)లో 10.2, గౌరారం (సిద్దిపేట జిల్లా)లో 11.1, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో 10.6, తాడ్వాయి (ములుగు)లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడ్డాయి.
హైదరాబాద్‌లో బీభత్సం సృష్టిస్తున్న వర్షం
హైదరాబాద్ మహా నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రెండు రోజులుగా వరుసగా వర్షం కురుస్తుంది. శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో వరద ముంచెత్తడంలో నగర వాసులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. నడుం నుంచి మొకాలు లోతు వరద నీరు వచ్చింది. పలు కాలనీలు, బస్తీలలో ఇళ్లలోకి నీరు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిహెచ్‌ఎంసి అత్యవసర బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్.బి.నగర్, వనస్థలిపురం, బి.ఎన్.రెడ్డి నగర్, యాకుత్‌పుర ప్రాంతాల్లో వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. ఉస్మాన్ సాగర్(గండిపేట్), హిమాయత్ సాగర్‌ల గేట్లు తెరవడంతో మూసీ నదిలో వరద ప్రవాహం పెరిగిపోయింది. దిల్‌సుఖ్‌నగర్ రహదారిని అనుసంధానం చేసే ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రెండువైపుల తీవ్రమైన ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే వర్షంతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంటనగరాల్లోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండుకుండలా మారాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో రెండవ ప్రమాద హెచ్చరికను జిహెచ్‌ఎంసి అధికారులు జారీ చేశారు.
6న అల్పపీడనం
RELATED ARTICLES