పారిస్ : మనం ఈరోజు చూసిన ముఖాన్ని రేపు మర్చిపోతాం. అదేసమయంలో కొన్నేళ్ల క్రితం చూసిన ఒక ముఖాన్ని గుర్తుపెట్టుకోగలం. మీరు ఫలానా వ్యక్తి కదా అని సంబోధించి మరీ పిలవగలం. అయితే మన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజూ మనకు తారసపడే వ్యక్తుల ముఖాలన్నీ మనకు గుర్తుంటాయా? ప్రతి వ్యక్తీ తన జీవితంలో కనీసం లక్ష ముఖాలనైనా చూస్తాడు. కానీ అన్ని ముఖాలూ గుర్తుండవు. అయితే శాస్త్రవేత్తలు చెపుతున్న విషయమేమిటంటే, ప్రతి మనిషి తన జీవితంలో 5000 ముఖాల వరకు గుర్తుపెట్టుకోగలడట. నిత్యం మన ముందు కన్పించే కుటుంబసభ్యులు, స్నేహితులు, అలాగే టీవీలు, పత్రికల్లో 24 గంటలూ కన్పించే ప్రముఖులతోపాటు ఇంకొంతమంది వ్యక్తుల ముఖాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఆ లెక్కన 5 వేల ముఖాల వరకు ఒక మనిషి గుర్తుంచుకోగలడని బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ యార్క్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఈ తరహా అధ్యయనం రావడం ఇదే ప్రథమం. బుధవారంనాడు ప్రొసీడింగ్స్ ఆఫ్ రాయల్ సొసైటీ బి అనే జర్నల్‌లో ఈ అధ్యయన పత్రం ప్రచురితమైంది. ప్రతి మనిషి కొన్ని వందల మంది లేదా 3, 4 వేలమంది వ్యక్తుల మధ్య జీవిస్తూవుంటాడు. ఆ వ్యక్తుల మేరకే ఆయనకు పరిచయం వున్నా లేకపోయినా, వారి ముఖాలను గుర్తించగలడు. వారు కాకుండా తమ బంధువులు, స్నేహితులతోపాటు రోజూ వార్తాపత్రికలు, ఛానల్స్, సినిమాల్లో కన్పించే ప్రముఖుల ఫోటోలను చూసి వారిని కూడా గుర్తుపెట్టుకోలడు. అంతకుమించి గుర్తుపెట్టుకోవడం ఆ వ్యక్తికి కష్టసాధ్యం. నిత్యం స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో బిజీగా వుండే సామాజిక పరిస్థితుల్లో బతికే వ్యక్తులు 5000 మంది వరకు ముఖాలను గుర్తించగలడని యార్క్ యూనివర్శిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ రాబ్ జెంకిన్స్ తెలిపారు.