ఎన్నికల ఫలితాల ప్రకటన ఆలస్యమైనా ఓకె
సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రతిపక్ష నాయకులు
న్యూఢిల్లీ: ఓటరు ధ్రువీకరణ రశీదు (వివి పాట్)లను 50 శాతం లెక్కించేట్లయితే లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడి 6 రోజులు ఆలస్యమైనా ఫర్వాలేదని, ఎన్నికల సమగ్ర ప్రక్రియలో అదేమంత ‘తీవ్ర ఆల స్యం’ కిందికి రాదని, ఆ ఆలస్యాన్ని తాము తీవ్రంగా పరగణించబోమని 21 ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టుకు తెలిపారు. వివి పాట్ రశీదుల 50 శాతం ధ్రువీకరణ చేపట్టినట్లయితే ఎన్నికల ఫలితాల ప్రకటన 5.2 రోజులు ఆలస్యం కాగలదని ఎన్నికల సంఘం చేసిన వాదనకు తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు తిరిగి సమాధానం (కౌంటర్ -రిప్లయ్) దాఖలు చేశారు. చంద్రబాబునాయుడు, తదితరులు 50 శాతం ఓటింగ్ మిష న్ల వివి పాట్ రశీదులను లెక్కించాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించనుంది. ఇప్పుడున్న సిబ్బందిని పెంచకుండా 50 శాతం ఓటింగ్ మిషిన్ల వివి పాట్ రశీదులను లెక్కించాలంటే ఎన్నికల ఫలితాల ప్రకటన 5.2 రోజులు ఆలస్యం కాగలదని ఎన్నికల సంఘం చెప్పింది. దానికి ప్రతిపక్షాలు ఒకవేళ సిబ్బందిని పెంచితే 5.2 రోజులకన్నా సమయాన్ని తగ్గించే అవకాశం ఏర్పడగలదని తెలిపాయి. ‘భారత ఎన్నికల సంఘం తీరుపై తమకు ఎలాంటి సందేహా లు లేవని, కాకపోతే ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు ఇదివరకటి ఆదేశాలకు మరింత సామర్థ్యం పెంచాలని కోరుతున్నాం. తాము లేవెనత్తిన సమస్య ఇవిఎంలకు సంబంధించిదని కాక ప్రజల నమ్మకానికి సంబంధించిందని, ఇప్పుడున్న మార్గదర్శకాలు అంతగా పటిష్టంగా లేవని, వివి పాట్ లెక్కింపు అన్నది కేవలం అలంకారప్రాయంగా ఉంది’ అని పిటిషనర్లు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు.