5వ తరగతి వరకుఅమ్మభాషే!

మానవ వనరుల అభివృద్ధి శాఖ విద్యాశాఖగా మార్పు
విద్యా విధానంలో భారీగా మార్పులు
నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించిన కేంద్రం
బిజెపి ఎజెండాలో భాగంగానే మార్పులు!
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగానే కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. కొన్ని సంస్కరణలు చేపట్టినప్పటికీ, బిజెపి కాషాయీకరణ ఎజెండా కోణంలోనే పలు మార్పులు జరిగినట్లు విశ్లేషకులు చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాలను పక్క కు నెట్టేసింది. బుట్టదాఖలు చేసిన సుబ్రమణియన్‌ కమిటీ నివేదిక స్థానంలో తమకు అనుకూలమైన కస్తూరిరంగన్‌ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదించింది. నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఇఆర్‌ఎ)కు పూర్తి పగ్గాలు అప్పగించే విధంగా మార్పులు జరిగాయి. పాఠశాల విద్యపై ఎన్‌సిఇఆర్‌టి ద్వారా కేంద్ర పెత్తనం కొనసాగేతా, పాఠ్యాంశాలను కేంద్రమే నియంత్రించేలా ప్రమాదకరమైన మార్పులు తీసుకువచ్చింది.ఈ సమూల ప్రక్షాళనలో విద్యావ్యాపారంపై నిషేధం గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం విచిత్రం. దయనీయ పరిస్థితిలో వున్న పాఠశాలల బాగుకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. కాకపోతే, దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ లో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించుకుంది. ఈ మేరకు కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్యను కేంద్రం తప్పనిసరి చేసింది. 5వ తరగతి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బోధన మాతృభాషలోనే ఉండాలని నిర్ణయించింది. విద్యార్థులపై కరికులమ్‌ భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశమని స్పష్టం చేసింది. 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలిపింది. ఇకపై ఆరట్స్‌, సైన్స్‌ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది. అలాగే ప్రస్తుతం ఉన్న విధానంలో కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 10+2(పదో తరగతి, ఇంటర్‌) విధానాన్ని 5+3+3+4 మర్చారు. ఇందులో మూడేళ్ల ప్రీ స్కూలింగ్‌/అంగన్‌వాడితోపాటుగా 12 ఏళ్ల పాఠశాల విద్య ఉండనుంది. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్‌ అమలు చేయనున్నారు. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్‌, ప్రోగామింగ్‌ కరికులమ్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆరో తరగతి నుంచే వొకేషన్‌ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్‌ నేర్పే ప్రయత్నం చేయనున్నారు. ఎమ్‌ఫిల్‌ కోర్సును పూర్తిగా రద్దు చేశారు. కాగా, ప్రస్తుతం ఉన్న జాతీయ విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1992లో దాన్ని సవరించారు. ఇస్రో మాజీ చీఫ్‌ కే కస్తూరిరంగన్‌ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసినందున, నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది తొలి కీలక మార్పుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకున్నది.

DO YOU LIKE THIS ARTICLE?