ప్రజాపక్షం / హైదరాబాద్ ; వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలోమీటర్లతో) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం పలు ప్రాంతాల్లో, సోమవారం చాలాచోట్ల వర్షాలు పడవచ్చని తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడురోజుల వరకు వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్ నుండి లక్షదీవులు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మారుమూల కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ధ్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. దీని వల్ల సుమారుగా జూన్ 1 వ తేదీన కేరళలోకి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. వచ్చే 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.
రుతుపవనాలు వచ్చేశాయంట!
ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడి
విభేదించిన భారత వాతావరణ కేంద్రం
న్యూఢిల్లీ : రుతుపవనాలు దేశంలోకి చేరుకునే విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు వాతావరణ సంస్థల మధ్య విభేదాలు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు షెడ్యూల్ కన్నా ముందుగానే కేరళ రాష్ట్రానికి చేరుకున్నాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ శనివారంనాడు వెల్లడించింది. అయితే అలాంటి వాతావరణ పరిస్థితులేమీ కనపడటం లేదని భారత అధికారిక వాతావరణ సంస్థ ఐఎండి (భారత వాతావరణ కేంద్రం) స్కైమెట్ ప్రకటనను విభేదించింది. దేశంలో వర్షపాత వాతావరణం నెలకొన్నదని, అవవేవ్, లాంగ్‌వేవ్ రేడియేషన్ (ఓఎల్‌ఆర్) విలువ, పవన వేగం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నదని స్కైమెట్ వెదర్ సిఇఓ జతిన్ సింగ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. సమయానికి ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని, చివరకు నాలుగు మాసాల వాన పండుగ మొదలైందని పేర్కొన్నారు. ‘హ్యాపీ మాన్‌సూన్’ అంటూ ట్వీట్ చేశారు. దేశంలో 75 శాతం వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబరు మాసాల మధ్యకాలంలో కేవలం నైరుతి రుతుపవనాల కారణంగా నమోదవుతుంది. జూన్ 5వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండి మొదట్లో ప్రకటించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల జూన్ 1 నాటికే రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం వుందని గతవారం ప్రకటించింది. అతే తాజాగా స్కైమెట్ విడుదల చేసిన ప్రకటన ఇందుకు విరుద్ధంగా వుంది. పైగా రుతుపవనాలు ఏకంగా కేరళను తాకేశాయని ఇది చెపుతోంది. దీనిపై ఐఎండి స్పందిస్తూ, అలాంటి పరిస్థితులేమీ లేవని వివరించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని చెప్పడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఇంకా కనపడటం లేదని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర లిపారు.