మృతుల సంఖ్యలో నాల్గవ స్థానానికి చేరువలో భారత్
24 గంటల్లో కొత్తగా 834 మంది కరోనా కాటుకు బలి
23 లక్షల దాటిన మహమ్మారి బాధితుల సంఖ్య
ఒక్కరోజే 60,963 మందికి పాజిటివ్ నిర్ధారణ
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల నుంచి నిత్యం 60 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాటికి దేశంలో కొవిడ్ బాధితుల సంఖ్య 23 లక్షల మార్క్‌ను దాటింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో మరో 60,963 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,29,638కు చేరికుంది. అదే విధంగా సంఖ్య గణనీయంగా పెరుగుతూ తీవ్రంగా కలవరపెడుతుంది. గడిచిన 24గంటల్లో మరో 834 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో బుధవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 46,091కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో అత్యధిక మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్ మరణాల సంఖ్యకు భారత్ చేరువయ్యింది. అయితే ఒకవైపు కొవిడ్ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ మరోవైపు పెద్ద బాధితులు మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 16,39,599 మంది కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో రికవరీ రేటు 70.38 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 6,43,948 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్త కేసుల్లో ఇది 27.64 శాతం మాత్రమే. ఇక మరణాల రేటు 1.98 శాతానికి పడిపోయింది. దేశంలో వైరస్ ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,60,15,297 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 7,33,449 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా బ్రెజిల్, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల జాబితాలో మాత్రం భారత్ నాలుగో స్థానానికి చేరువయ్యింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం కొవిడ్ మరణాలు అధికంగా ఉన్న తొలి ఐదుదేశాలను పరిశీలిస్తే… అమెరికాలో 1,63,462 మరణాలు (51,41,013 కేసులు), బ్రెజిల్‌లో 1,01,752 (30,57,470 కేసులు), మెక్సికోలో 53,003 (4,92,522 కేసులు), బ్రిటన్‌లో 46,611 (3,13,394 కేసులు), భారత్‌లో 46,091 (23,29,638 కేసులు) మరణాలు సంభవించాయి.
మహారాష్ట్రలో మూడోసారి 300మరణాలు…
కొవిడ్ మహమ్మారి తీవ్రతకు మహారాష్ట్ర వణికిపోతోంది. నిత్యం భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో పాటు మరణాల కూడా పెద్ద సంఖ్యలో సంభవిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 256 మంది ప్రాణాలు కోల్పోయారు. 18,306 మంది మరణించారు. తమిళనాడులోనూ రోజుకు వందకు పైగా మరణిస్తున్నారు. 24 గంటల్లో 118 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 5,159కు చేరింది. ఢిల్లీలో కొత్తగా 8 మంది మృతి చెందగా, 4,139కు పెరిగింది. కర్నాటకలో 24 గంటల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 3,398 మంది మరణించారు. గుజరాత్‌లో తాజాగా 23 మంది, మొత్తంగా 2,695, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 87 మంది, మొత్తంగా 2,203 మంది, ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 56 మంది, మొత్తంగా 2,176, పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 49 మంది, మొత్తంగా 2,149, మధ్యప్రదేశ్‌లో తాజాగా 18 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 1,033కు చేరింది.
మహారాష్ట్రలో మరో 264 మంది పోలీసులు కొవిడ్
మహారాష్ట్ర పోలీస్ శాఖను కరోనా వణికిస్తోంది. తాజాగా మరో 264 మంది పోలీసులు కొవిడ్ బారినపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన పోలీసుల సంఖ్య 11వేలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11,392 మంది పోలీసులకు కరోనా సోకింది. వీరిలో 1179 మంది పోలీస్ ఉన్నతాధికారులు కాగా, మిగతా 10,213 మంది పోలీసు సిబ్బంది ఉన్నట్టు పోలీస్ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్ బారిన పడినవారిలో ఇప్పటివరకు 9187 మంది కోలుకోగా.. 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
46 వేలుదాటిన మరణాలు
RELATED ARTICLES