- ఆర్థిక,దౌత్య సంబంధాల మెరుగుదలకు కృషి
- రియాద్‌లో రష్యా- అమెరికా అంగీకారం
రియాద్ : రెండు దేశాలమధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవాలని, ఉక్రేన్‌లో యుద్ధ విరమణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాలని రష్యా ప్రతినిధులు అంగీకరించారు. శాంతిచర్చలకోసం ఒక ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సౌదీఅరేబియా నగరం రియాద్‌లో రెండు అగ్రరాజ్యాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో మైలురాయిగా నిలిచిపోయే అంగీకారం కుదిరింది. సౌదీ అరేబియా విదేశాంగమంత్రి కూడా చర్చల్లో పాల్గొన్నారు. యుద్ధ విరమణకు రష్యా ఏ మేరకు ఆసక్తిగా ఉందనే విషయం తెలుసుకోవడానికే ఈ సమావేశంతప్ప, ఉక్రేన్‌లో శాంతి ప్రక్రియ చర్చలు ప్రారంభం కాలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఒక వివరణ ఇచ్చారు. ఐతే దౌత్య పరమైన సంబంధాలు వృద్ధి చేసుకోవాలని అమెరికా ప్రతినిధులు అంగీకరించారు. రెండు దేశాలూ ప్రధానంగా మూడు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని చర్చల అనంతరం అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో అసోసియేటెడ్ ప్రెస్‌కు చెప్పారు. ఉక్రేన్‌లో యుద్ధ విరమణ ప్రక్రియకు వీలుగా వాషింగ్టన్ దౌత్య కార్యాలయాలలో సిబ్బందిని పునరుద్ధరించాలని, శాంతిచర్చలకు ఉన్నతస్థాయీ బృందాన్ని ఏర్పాటు చేయాలని అంగీకరించినట్లు చెప్పారు. రెండు దేశాలమధ్య ఆర్థిక సహకారాభివృద్ధిని అన్వేషించాలని అంగీకరించినట్లు చెప్పారు. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్‌రోవ్,ఇతర సీనియర్ అధికారులు రష్యా తరపున చర్చల్లో పాల్గొన్నారు. లావ్‌రోవ్ కూడా దాదాపు రుబియో అభిప్రాయాలనే వెల్లడించారు. ఇది ఆరంభం మాత్రమేననీ, చేయవలసింది ఎంతో మిగిలి ఉందనీ చెప్పారు. “మేం కేవలం వాళ్ళు చెప్పినవి వినడమే కాదు, మేం పరస్పరం ఒకరి అభిప్రాయాలను మరొకరం శ్రద్ధగా విన్నాం” అన్నారు. ట్రంప్ సన్నిహితుడైన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్, మధ్యాసియాలో ప్రత్యేకదూత స్టీవెన్ విట్‌కోఫ్, రష్యా తరపున లోవ్‌రోవ్‌తోపాటు పుతిన్‌కు సన్నిహితుడు, రష్యా జాతీయ భద్రతా సలహాదారు యూరీ ఉషకోవ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కానీ ఉక్రేన్ తరపున ఏ ఒక్క అధికారీ చర్చల్లో పాల్గొనలేదు. చర్చలకు రావాలని ఎలాంటి ఆహ్వానం అందలేదని ఉక్రేన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తమదేశ భాగస్వామ్యం లేకుండా జరిగే ఈ చర్చలను అంగీకరించబోమని, తమకు హానిచేసే ఫలితాలను ఒప్పుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు. యూరప్ దేశాలు కూడా ఈ చర్చల ప్రారంభానికి ముందునుండీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమను పక్కకు నెట్టేశారని, నాటో,ఉక్రేన్ లేకుండా జరిగే చర్చలకు ఎలాంటి విలువా ఉండబోదని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది.
రష్యా మధ్య కొత్త బంధం!
ఉక్రేన్‌లో యుద్ధ నివారణ పేరుతో జరిగిన చర్చల్లో రష్యా మధ్య కొత్త బంధానికి తెరలేచింది. రెండు దేశాలు దౌత్య, ఆర్థికపరమైన సహకారాన్ని, సంబంధాలను మెరుగుపరచుకునేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ రెండు దేశాలమధ్య సంబంధాలు క్షీణస్థాయికి చేరుకున్నాయి. ఉక్రేన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని 2014లో రష్యా ఆక్రమించుకుందని అమెరికా ఆరోపించడంతో సంబంధాలు క్షీణించాయి. ఉక్రేన్‌తో పూర్తిస్థాయీ యుద్ధం (2022 ఫిబ్రవరి 24) మొదలయ్యాక అంతంతమాత్రంగా ఉండే సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆర్థిక, సాంఘిక ఆంక్షలు అమలు చేశాయి. దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. “ఉక్రేన్‌లో యుద్ధం ముగిసిపోతే ఇక తలుపులు పూర్తిగా తెరచుకున్నట్టే”’ అని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో అన్నారు. ఆయనతోపాటు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లోవ్‌రోవ్ కూడా పత్రికాగోష్ఠిలో మాట్లాడారు. ఈ సమావేశం ఎంతో సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని విట్‌కాఫ్ చెప్పారు. చర్చల్లో పాల్గొన్నవారంతా మంచి ఫలితాలు సాధించాలనే అభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. రెండు సంవత్సరాల క్రితం జి సదస్సు సందర్భంగా లోవరోవ్, నాటి అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ కాసేపు మాట్లాడుకున్నారు. కానీ అప్పటికి ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.
రష్యాపై యూరప్ మరిన్ని ఆంక్షలు
24వ తేదీ నుండీ అమలు
బ్రస్సెల్స్: రష్యాపై యూరప్ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాయి. ఉక్రేన్, యూరప్‌లను పిలవకుండా యుద్ధ సమస్య పరిష్కారానికి సమావేశం జరపడాన్ని యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో యూరప్‌లోని 27 దేశాల దౌత్యవేత్తలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారంనాడు ఒక ప్రకటన వెలువడింది. ఈ కొత్త ఆంక్షల ప్రకారం 50 మంది రస్యా అధికారులపై, అక్రమంగా రవాణా అవుతున్న రష్యా సరుకుపై గురిపెడతారు. ఈనెల 24వ తేదీతో ఉక్రేన్‌లో యుద్ధానికి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజు నుండి రష్యాపై కొత్త ఆంక్షలు అమలులోకి వస్తాయని యూరోపియన్ యూనియన్ ఉన్నతస్థాయీ దౌత్యవేత్త స్పష్టం చేశారు.
గత మూడేళ్ళుగా రష్యాపై అనేక విడతలుగా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రియాద్ సమావేశంలో ఉక్రేన్,యూరోపియన్ యూనియన్ జోక్యం లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 2,300 సంస్థలు, అధికారులు, ప్రభుత్వ ఏజన్సీలు, బ్యాంకులకు ఈ ఆంక్షలవల్ల నష్టం కలిగింది. రవాణా నిషేధం, ఆస్తుల స్తంభన,వాణిజ్యంపై ఆంక్షలు సహా 16వ విడత ఆంక్షలను యూరప్ దౌత్యవేత్తలు ధృవీకరించారు. రష్యా నౌకల సరుకును ఆంక్షలు తప్పించుకోవడంకోసం వేరేపేరుతో రవాణా అవుతున్నాయి. చమురు, గ్యాస్ రవాణా జరుగుతోంది. ఉక్రేన్ నుండి దొంగిలించిన గ్యాస్‌ను కూడా అక్రమ మార్గంలో రవాణా చేస్తున్నారు. ఇలా 70 నౌకలు షాడో ఫ్లీట్ పేరుతో అక్రమంగా రవాణా అవుతున్నాయి.