కరీంనగర్, నిజామాబాద్, మాల్కాజిగిరి నియోజకవర్లాల నుంచి బరిలోకి
మరొక స్థానాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తాం
తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్
ప్రజాపక్షం/ హైదరాబాద్: నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్ల తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్, మాల్కాజిగిరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, ఒకటి, రెండు రోజుల్లో మరో నియోజకవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. మిగిలిని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతునిస్తామని, సిపిఐ పోటీ చేసే స్థానాలకు మద్దతు కోరితే తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 16, 17న భద్రాచలం నుంచి “ఆదివాసుల హక్కుల యాత్ర”ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో టిజెఎస్ నాయకులు పి.ఎల్. విశ్వేశ్వర్‌రావు, దిలీప్‌కుమార్, యోగేశ్వర్‌రెడ్డి వెదిరె, భైరి రమేష్‌లతో కలిసి కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 7న రాష్ట్ర కమిటీ సమావేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఓటమికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని వివరించారు. ఆర్థిక సమస్యల పరిష్కారానికి క్రీయశీలకంగా పనిచేయాలన్నారు. ఢిల్లీలో రూపొందించిన “రీ క్లేమింగ్ రిపబ్లిక్” ఎన్నికల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము రూపొందించిన ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా త్వరలోనే మేనిఫెస్టోను తయారు చేస్తామని, దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. పార్టీతో సంబంధం లేని వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి మూడు కమిటీలను ఏర్పాటు చేశామని, మానిటరింగ్, పొలిటీకల్ ఎఫైర్స్ కమిటీ, క్రమశిక్షణ కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. అద్భుతమైన కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు. పార్టీ నిర్మాణానికి దోహదపడే నియోజకవర్గాల్లోనే తాము అభ్యర్థులను నిలబెట్టామని వివరించారు. ఉద్వేగాన్ని, భావోద్వేగాన్ని రెచ్చగొట్టేలా రాజకీయాలు మారాయాని, నిత్యజీవితంలోని ప్రజా సమస్యలు ఎజెండా మీదకు రానివ్వడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. అమరుల ఆకాంక్షల పాలన సాగడం లేదన్నారు. ఆకాంక్షల సాధన లక్ష్యంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. యువత, రైతాంగ భవిష్యత్తు గందరగోళానికి గురిచేస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు సాగుతామన్నారు. పి.ఎల్. విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ స్థానికంగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే తాము పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజులు “ఆదివాసుల రక్షణ యాత్ర” : ఆదివాసిల హక్కుల సాధన కోసం ఈ నెల 16న భద్రాచలంలో “ఆదివాసుల హక్కుల రక్షణ యాత్ర”ను ప్రారంభించనున్నట్లు కోదండరామ్ వివరించారు. ఈ యాత్ర భద్రాచలం నుంచి మొదలై పాల్వంచ, ఇల్లందు, పాకాల, నర్సంపేట, మరుసటి రోజు 17న ములుగు, పస్ర, తాడ్వాయి, ఏటురునాగారం, మంగపేట, మేడారం వద్ద ముగుస్తుందని వివరించారు. ఈ యాత్ర ద్వారా భూమి సమస్యలను అడిగి తెలుసుకుంటామని వివరించారు. ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ఇటీవల అఖిలపక్షసమావేశాన్ని నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.