‘కన్నప్ప’లో మంచు విష్ణు కుమారుడు
మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై సందడి చేస్తోంది. కథానాయకుడు మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ ‘కన్నప్ప’లో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. మంచు విష్ణు ప్రధాన పాత్రధారిగా… ఆయన నిర్మాణంలోనే రూపొందుతున్న చిత్రమిది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్, మోహన్‌బాబుతోపాటు మోహన్‌లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌లో 90 రోజుల షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని తిరిగొచ్చింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఐదేళ్ల వయసున్న అవ్రామ్ తెరకు పరిచయం అవుతున్న విషయాన్ని చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. విష్ణు మంచు స్పందిస్తూ… ”నా జీవితంలో ఈ సినిమాకి ఎంతో ప్రాధాన్యం ఉంది. నా కుమారుడు అవ్రామ్ కీలక పాత్రలో నటిస్తుండడం గర్వకారణం. మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తున్న ఓ అరుదైన చిత్రం ఇది. మా కుటుంబంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది” అన్నారు.