అర్ధరాత్రి గౌరవెల్లి ప్రాజెక్టు బాధితుల అరెస్టు
సిఆర్‌పిఎఫ్ బలగాల దాడి
హుస్నాబాద్ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అడ్డగించిన పోలీసులు
తోపులాట, లాఠీచార్జి
ప్రజాపక్షం / అక్కన్నపేట
సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి భూ నిర్వాసితుల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం హుస్నాబాద్‌కు తరలివచ్చిన గౌరవెల్లి భూ నిర్వాసితులను ఆర్‌డిఒ కార్యాలయం ముందు పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో నిర్వాసితులు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు ఎసిపి సతీశ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన విరమించలేదు. మరోవైపు ఆర్‌డిఒ కార్యాలయానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేస్తున్న భూనిర్వాసితులకు ఆయన నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తుండగా భూ నిర్వాసితు లు విన లేదు. ఉదయం అరెస్టు చేసిన గుడాటిపల్లి సర్పంచ్‌తో తమ గ్రామస్థులను విడుదల చేసిన తర్వాతే మాట్లాడుతామంటూ ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సోమవారం ఉదయం నుంచి హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కాగా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని అక్కన్నపేట మండలం గుడాటిపల్లి నిర్వాసితులను అర్థరాత్రి పోలీసులు అక్రమం గా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలని,రావాల్సిన పరిహారం ఇవ్వాలని కోరుతూ ప్రాజెక్టు కట్ట వద్ద దీక్ష చేశామని ,అకస్మాత్తుగా పోలీసులు సిఆర్‌పిఎఫ్ బలగాలు వచ్చి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిర్వాసితుల మధ్య జరిగిన తోపులాటలో పలువురికి తీవ్ర గాయాలు అయిన వదలకుండా తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. పోలీసలు అంతటితో ఆగకుండా ఇళ్ల పై దాడి చేసి మహిళలను, యువకులను అక్రమంగా అరెస్టు చేసి రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారన్నారు.
లాఠీఛార్జ్ చేయలేదు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎసిపి కార్యాలయంలో గుడాటిపల్లి భూనిర్వాసితుల ఘటనపై సిపి శ్వేతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లిలో ప్రాజెక్ట్ కెనాల్ సర్వేకు సంబంధించి కొంతమంది భూ నిర్వాసితులు అడ్డుకుంటున్నారని ఇరిగేషన్ అధికారుల నుంచి ఫిర్యాదు వచ్చినట్లు సిపి తెలిపారు. ఈ మేరకు గుడాటిపల్లి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి అధికారులకు సర్వే చేయడానికి సహకరించామని… అడ్డుకోవాలని ప్రయత్నించిన నిర్వాసితులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే సమయంలో తోపులాట జరిగిందన్నారు. అంతేకాని వారిపై లాఠీఛార్జ్ జరగలేదని వెల్లడించారు. రైతులపై, మహిళలపై ఎలాంటి అదనపు ఫోర్స్‌ను వినియోగించలేదన్నారు. పంపుహౌస్ వద్ద ఎలాంటి ఆటంకాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భూమి కోల్పోతున్న నిర్వాసితులను ఎలాంటి ఇబ్బంది పెట్టే చర్యలకు గురి చేయడం లేదన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నిర్వాసితులతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.