అందుకు ప్రజలు ముందుకు రావాలి
అర్బన్ ఫారెస్ట్ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్ పిలుపు
ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ సాధించాలనే ప్రభుత్వ లక్ష్యం ఆచరణరూపం దాల్చేందుకు ప్రజలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఎ) అభివృద్ధి చేసిన రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును గురువారం అటవీ శాఖమంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవడం సైతం అంతే ముఖ్యమని ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధమైన నిబంధనలు రూపొందించిందని, అందులో భాగంగానే కొత్త మున్సిపల్ , పంచాయతీరాజ్ చట్టం రూపొందాయని తెలిపారు. వీటితోపాటు స్థానిక సంస్థల్లో పది శాతం బడ్జెట్ గ్రీన్ బడ్జెట్‌గా నిబంధనలు విధించారని తెలిపారు. నాటిన మొక్కల్లో 85 శాతం మనుగడ సాధించనట్లయితే అక్కడి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే కఠినమైన నిబంధనలను పొందుపరిచారని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. మొక్కలను పెంచడం, వాటిని సంరక్షించుకోవడం అలవాటుగా మార్చుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మానవ హితిహాసంలోనే మూడవ అతిపెద్ద కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టులు ఇందుకు తార్కాణమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీ పెంపుదలకు 129 పార్కులను అభివృద్ధి చేస్తుండడం సంతోషకరమన్నారు. హెచ్‌ఎండిఎ విస్తీర్ణంలో 1.60 లక్షల ఎకరాల్లో 59 అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీటితోపాటు మరో 16 పార్కులను ఇదే స్థాయిలో ఏర్పాటుచేయడం జరిగిందని మంత్రి కెటిఆర్ వివరించారు. హరితహారం కార్యక్రమం నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దేశంలో మంచి గుర్తింపు వచ్చిందని అటవీ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 15,500 నర్సరీలు తెలంగాణలో పనిచేస్తున్నాయని, వాటిల్లో హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి నర్సరీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు హరితహారం కింద ఏడు విడతల్లో 220 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటామని, ఈ ఏడాది మరో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హరితహారం కార్యక్రమం ద్వారా నాలుగు శాతం మేరకు అడవుల విస్తీర్ణం పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు స్థానిక ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సిలు పట్నం మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు, సురభి వాణిదేవి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, అటవీ శాఖ ప్రిన్సిపల్ సిసిఎఫ్ ఆర్.శోభ, పిసిసిఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమోయ్ కుమార్ తదితరులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెడ్‌పి చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న లతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. హెచ్‌ఎండిఎ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్.రెడ్డి,అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
33% గ్రీనరీయే లక్ష్యం
RELATED ARTICLES