30 రోజులూ బాగున్నాయి!

విద్యుత్‌ శాఖదే నెంబర్‌ వన్‌
ప్రతి నెల గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు
‘పల్లె ప్రగతి’పై జిల్లా కలెక్టర్లతో సిఎం సమీక్ష

ప్రజాపక్షం/హైదరాబాద్‌: గ్రామ పంచాయతీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమని, ప్రతీ నెలా గ్రామ పంచాయతీలకు రూ. 339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అడవులు తక్కువుగా ఉన్న కరీంనగర్‌, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, గద్వాల్‌, నారాయణపేట తదితర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్‌పిఓలు, ముఖ్యకార్యదర్శులతో ప్రగతిభవన్‌లో గురువారం సమావేశం జరిగింది. పతీజిల్లా కలెక్టర్‌ 30 రోజుల కార్యక్రమ అమలులో తమ అనుభవాలను సిఎం కెసిఆర్‌కు వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సమిష్టి ప్రణాళిక, సమిష్టి కార్యాచరణ, సమిష్టి అభివృద్ధి అనే ఆశయాలతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్లు వెల్లడించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను వారు వివరించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్‌పిఓలు, ఎంపిఒలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులను సిఎం అభినంధించారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, పిసిసిఎఫ్‌ శోభ, డిస్కమ్‌ల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో చురుకైన పాత్ర పోషించి కేంద్ర ప్రభు త్వం నుంచి అవార్డులు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్‌ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, భూపాలపల్లి కలెక్టర్‌ వెంకటేశ్వర్లును సిఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం, -పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ(పల్లె ప్రగతి) దిగ్విజయంగా అమలైందన్నారు. అన్ని గ్రామాల్లో పవర్‌ వీక్‌ నిర్వహించి, విద్యుత్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో విద్యుత్‌ శాఖ అద్భుతంగా పనిచేసి, అన్ని శాఖల్లో నెంబర్‌ వన్‌ గా నిలిచిందన్నారు. గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి ఇది అదనమని ఆయన చెప్పారు. గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశ్యంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్లు సిఎం వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరి శుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందన్నారు. ఈ స్పూర్తిని కొనసాగించేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుపోవాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?