మూడో అతి పెద్ద బ్యాంకుగా అవతరణకు మార్గం సుగమం
కుటుంబ సంక్షేమ ఛాత్ర పథకానికీ ఓకె
అస్సామీల ఐడెంటిటీ రక్షణకు ఉన్నత స్థాయి సంఘం
జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేబినెట్ ప్రశంస
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులు విలీనం తర్వాత మరో విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వెల్లడించారు. ఈ మూడింటి విలీనం వల్ల ఏర్పడే కొత్త బ్యాంకు ఎస్‌బిఐ, ఐసిఐసిఐ తర్వాత దేశంలోనే మూడో అతిపె ద్ద బ్యాంక్‌గా అవతరించనుంది. మొదటి రెండు పెద్ద బ్యాంకులు ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకులు. విలీ నం వల్ల సదరు బ్యాంకు ఉద్యోగుల సర్వీసుపై అంటే రిట్రెంచ్‌మెంట్ వంటి ప్రభావం ఉండబోదన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన విలీన ప్రకటన ప్రకారం ఆ బ్యాంకు ప్రతి 1000 షేర్లకు విజయ బ్యాంకు402 ఈకిటీ షేర్లు, దేనా బ్యాంక్ 110 ఈక్విటీ షేర్లు పొందనున్నాయి. ఈ విలీనం వల్ల బ్యాంకు సిబ్బందితో పాటు ఖాతాదారులకు లాభాలు చేకూరతాయని ప్రభుత్వం చెబుతోంది. విలీన ప్రక్రియ ముగిశాక ఏర్పడే కొత్త బ్యాంకులో సుమారు 85వేల మందికి పైగా ఉద్యోగులుంటారు. దేశ, విదేశాల్లో కలిపి దానికి 9,485 శాఖలు ఏర్పడతాయి. 2019 ఏప్రిల్1 నుంచి ఈ విలీనం అమల్లోకి వస్తుంది. ఇదిలా ఉంటే మూడు బ్యాం కుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గత నెల బ్యాంకు యూనియన్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. బ్యాం కు విలీనం కారణంగా సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విలీనం తర్వాత ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గనున్నది. విలీనానంతరం ఉద్యోగులు మం చి పని పరిస్థితులు పొందనున్నారని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ గత ఏడాదే తెలిపారు. బ్రాండ్ ఐడెంటీని కూడా కాపాడతామన్నారు. విలీన పథకాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాలకన్నా ముందే ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జనవరి 8న ముగియనున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు ధర రూ. 119.40, విజయ బ్యాంకు షేరు ధర రూ. 51.05, దేనా బ్యాంక్ షేరు ధర రూ. 17.95 వద్ద బుధవారం ట్రేడయ్యాయి.