మధ్యాహ్నం 12.10 గంటలకు ఉభయ సభలు భేటీ
తొలిరోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
ఈసారీ గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహణ
ఈ ఏడాది తెలంగాణ పద్దు రూ.2.85 3 లక్షల కోట్లు ?
ప్రజాపక్షం /హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు సమావేశం కానున్నాయి. శాసనమండలి చైర్మన్ ఆదేశాల మేరకు శాసనమండలిని, శాసనసభ స్పీకర్ ఆదేశాల మేరకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ఎంఎల్‌సి, ఎంఎల్ఏలను లెజిస్టేచర్ సెక్రెటరీ డాక్టర్ వేదాంతం నరసింహాచార్యులు సమాచారం తెలియజేశారు. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గవర్నర్ , రాష్ట్ర ప్రభుత్వం నడుమ ఘర్షణపూరిత వాతావరణం కొనసాగుతుండడంతో, బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఆనవాయితీగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఈ సారి లేదు. చివరి సారిగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ దాదాపు రెండేళ్ళ క్రితం 2021 మార్చి 15న ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. గత శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమోదించిన ఎనిమిది బిల్లులకు గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలియజేయకపోవడంతో ప్రభుత్వంతో అఘాదం మరింత పెరిగింది. సాధారణంగా శాసనసభ సమావేశాలు ప్రోరోగ్ అయినట్లయితే, ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగంతో సభలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇది బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరుగుతోంది. కాని , గత ఉభయ సభలు కేవలం నిరవధికంగానే వాయిదా వేసారే తప్ప ప్రోరోగ్ కాలేదు. దీని ఆధారంగా అంతకుముందు బడ్జెట్ సమావేశాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చివరి సారిగా శాసనసభ, మండలి సమావేశాలు సెప్టెంబర్ 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు కొనసాగాయి. ఆ తరువాత నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతోగవర్నర్ ప్రమేయం లేకుండానే ఉభయ సభల సభాపతులు నేరుగా ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని శాసనసభ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడంతో, ఈ మేరకు ఎంఎల్‌సిలు, ఎంఎల్ఏలకు ఆయన లేఖల ద్వారా సమాచారం తెలియజేశారు.
ఈ సారి భారీ బడ్జెటే
రాష్ట్ర 2023- వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2022-=23లో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నాయి. అవి కూడా కలుపుకొంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర సొంత ఆదాయం 19–=20 శాతం వృద్ధి నమోదు చేయనుండడంతో ఈ సారి బడ్జెట్ పరిణామాన్ని మరింత భారీగా పెంచనున్నట్లు భావిస్తున్నారు.
3 నుంచి బడ్జెట్ సమావేశాలు
RELATED ARTICLES