3 రాజధానులకు ఓకె

‘రాజధాని వికేంద్రీకరణ’కు, ‘సిఆర్‌డిఎ’ రద్దు బిల్లుకు ఎపి గవర్నర్‌ ఆమోదముద్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు బిల్లులను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించారు. మూడు వారాల కిందట ఈ బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌ వద్దకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా రెండు బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో శాసన ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్లులపై న్యాయ శాఖ అధికారులతో గవర్నర్‌ సంప్రదింపులు జరిపారు. అనంతరం వీటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత నెల 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండా నెల రోజులకు స్వయంచాలితంగానే (ఆటోమేటిక్‌) ఆమోదం పొందినట్లు పరిగణిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత నెల 17న మండలికి పంపిన ఈ బిల్లులకు ఈనెల 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావించింది. దీంతో తుది ఆమోదానికి గవర్నర్‌కు పంపారు. గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి ఛైర్మన్‌ అప్పట్లో సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు బిల్లులపై హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.
గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంతో రెండు చట్టాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫై చేసింది. అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం -2020గా పేర్కొంటూ రెండు చట్టాలకు సంబంధించి వేర్వేరు గెజిట్‌లను ప్రభుత్వం విడుదల చేసింది.
త్వరలో పరిపాలన రాజధానికి సిఎం శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మూడు రాజధానుల బిల్లుకు, సిఆర్‌డిఎ రద్దు బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. త్వరలో పరిపాలన రాజధానికి సిఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయ్యాక శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఢిల్లీ, ముంబయితో పోటీపడేలా విశాఖ అభివృద్ధి చెందుతుందని బొత్స తెలిపారు. విశాఖలో ప్రభుత్వ భూములే ఎక్కువ వాడుకుంటామని స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?