3 రకాల బస్సులు

ఉద్యోగులే సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసుకున్నారు
సంఘాల గుత్తాధిపత్యమే కారణం
ఉద్యోగాలు పోయాక ఇక యూనియన్లే ఉండవు
సంస్థలో ఇక యూనియనిజం లేదు
ఇష్ఠానురీతిలో సమ్మెచేస్తామనడం దురహంకారం
సమీక్షలో సిఎం కెసిఆర్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌: టిఎస్‌ఆర్‌టిసిని పూర్తిగా ప్రైవేటీకరించడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదని, ఆర్‌టిసి సంస్థ ఉండి తీరాల్సిందేననీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని, తదనుగుణంగానే ఆర్‌టిసిని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామని సిఎం అన్నారు. మొత్తం ఆర్‌టిసిని ప్రైవేట్‌ పరం చేయడం వివేకమైన చర్య కాదని కూడా ఆయన చెప్పారు. క్రమశిక్షణను తుచ తప్పకుండా అమలు చేసి ఆర్‌టిసిని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్‌టిసికి సంబంధించిన ప్రతిపాదనలను తయా రు చేసి ముఖ్యమంత్రికి అందజేసింది. ఆ ప్రతిపాదనలపై సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి ఎం. మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, సిఎంఒ ముఖ్య కార్యదర్శి ఎస్‌ నర్సింగ్‌ రావు, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, అడిషనల్‌ డిజిపి జితేంద్ర తదితర ఆర్‌టిసి, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆర్‌టిసిలో 10,400 బస్సులున్నాయని, వీటిని భవిష్యత్‌లో మూడు రకాలుగా విభజించి నడపాలని, 50 శాతం బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్‌టిసికి చెందినవిగా, ఆర్‌టిసి యాజమాన్యంలోనే వుంటాయి. 30 శాతం బస్సులు, అంటే 3100 బస్సులు అద్దె రూపంలో తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్‌టిసి పర్యవేక్షణలోనే, ఆర్‌టిసి పాలన కిందే నడపడం జరుగుతుందని వివరించారు. వాటిని వుంచడం కూడా ఆర్‌టిసి డిపోలలోనేనని, మరో 20 శాతం బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రైవేటువని, ప్రైవేట్‌ స్టేజ్‌ కారేజ్‌విగా అనుమతి ఇస్తారన్నారు. ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలన్నారు. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్‌ కారేజ్‌ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలో కూడా నడపాలన్నారు. ఆర్‌టిసి చార్జీలు, ప్రైవేట్‌ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్‌టిసి నియంత్రణలోనే వుంటాయన్నారు. వారి చార్జీలు కూడా ఆర్‌టిసి పెంచినప్పుడే పెంచాలన్నారు. స్వల్పంగా పెంచడానికి కూడా ఆర్‌టిసి కమిటీ నిర్ణయం మేర కు అవసరం అని భావించినప్పుడు చేయాలన్నారు. ఇప్పటికీ 21 శాతం అద్దె బస్సులను ఆర్‌టిసి నడుపున్నదని, అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9 శాతమేనన్నారు. అదనంగా 9 శాతం అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్‌టిసికి కొత్త బస్సులు వచ్చినట్లే అని అన్నారు. ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన కారణం ఆర్‌టిసి యూనియన్ల అతిప్రవర్తనేనని చెప్పారు. తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారని పేర్కొన్నారు. గత 40ఏళ్లుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చిందన్నారు. టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్‌టిసి యూనియన్లు, టిఅర్‌ఎస్‌ ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగారని, ప్రభుత్వం ఏది వున్నా యూనియన్ల అతిప్రవర్తనలో మార్పు లేదన్నారు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మానేజ్‌మెంట్‌కు ఇవ్వరని అన్నారు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం, పండగలకు, విద్యార్థుల పరీక్షలకు, ఎవరూ కష్ట పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సమ్మె ఉధృతం చేస్తామనడం హాస్యాస్పదమని, ప్రభుత్వం దృష్టిలో, ఆర్‌టిసి యాజమాన్యం దృష్టిలో ఆర్‌టిసి సిబ్బంది 1200 మాత్రమేనని, మిగతావారిని డిస్మిస్‌ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనేలేదని, ఎవరు ఎవరినీ డిస్మి స్‌ చేయలేదని, వాళ్ళంతట వాళ్ళే తొలగిపోయారన్నారు. గడువులోపల విధుల్లో చేరకపోవడంతో వాళ్ళది సెల్ఫ్‌ డిస్మిస్‌ అయినట్లేనన్నారు. ప్రభుత్వ, ఆర్‌టిసి యాజమాన్య విజ్ఞప్తికి వారు స్పందించలేదని, ఉద్యోగాల నుంచి తొలగిపోయిన వారు డిపోల దగ్గర కానీ, బస్‌ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని డిజిపిని ఆదేశించానని, విధుల్లో వున్న 1200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా, సరైన చర్యలు డిజిపి తీసుకుంటారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందినవారు, ఉద్యోగులు, తదితరుల రాయితీ బస్‌ పాసులు ఇక ముందు కూడా కొనసాగుతాయని, ఇవన్నీ ఆర్‌టిసి నియంత్రణలోనే వుంటాయని, రాయితీల మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని, దానికి కావాల్సిన నిధులను బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?