రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్షలు
90 శాతం అభ్యర్థులు హాజ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షను అభ్యర్థులు ఉత్సాహంగా రాశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్‌జిటి ఉద్యోగాల అర్హత కోసం పేపర్-1.. 6 నుంచి 8 వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్‌కు అర్హత కోసం పేపర్-2 నిర్వహించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 వరకు… మొదటి పేపర్, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు రెండో పేపర్ రాశారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. టెట్‌కు90శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం పేపర్-1కు 90.62 శాతం హాజరు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 51వేల 482 అభ్యర్థుల్లో 3 లక్షల 18 వేల 506 మంది హాజరు కాగా… 32 వేల 976 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్ 2కి 90.35 శాతం హాజరు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 77 వేల 900 మందిలో 2 లక్షల 51 వేల 70 మంది హాజరుకాగా 26 వేల 830 మంది గైర్హాజరయ్యారు. ఈ నెల 27న టెట్ ఫలితాలు వెల్లడించనున్నట్టు కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం టెట్ ఉత్తీర్ణత.. జీవితకాలం వర్తిస్తుంది. త్వరలో 13 వేల 86 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనుండటంతో ఈసారి టెట్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పేపర్-1కు బిఇడి, డిఇడి అభ్యర్థులు.. పేపర్ 2కు బిఇడి అభ్యర్థులు పోటీపడ్డారు. ఆయా కేంద్రాల్లో నిర్వహించిన టెట్‌కు సుదూర ప్రాంతాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల బయట.. పిల్లలతో తండ్రులు నిరీక్షించిన దృశ్యాలు కనిపించాయి. చాలాకాలం తర్వాత పరీక్ష జరగడం వల్ల పోటీ తీవ్రంగా ఉంది. పరీక్ష రాసేందుకు గృహిణులు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల ఆలనాపాలనా చూసేందుకు కుటుంబసభ్యులు నానా తంటాలుపడ్డారు. ఎండల తీవ్రత దృష్ట్యా చెట్లకు ఉయ్యాలలు కట్టి వారిని ఊరడించారు. ఓ పాప ఆకలితో ఏడుస్తుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పాలు పట్టించారు. కొన్ని కేంద్రాలకు గర్భిణులు సైతం పరీక్ష రాసేందుకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడలో టెట్ రాసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థికి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బంది ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా నిర్మల్ జిల్లాలో నిర్మల్ భైంసా జాతీయ రహదారి మార్గంలోని దిలావర్‌పూర్ మండలం లోలం గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెట్ అభ్యర్థి ప్రాణాలు కోల్పోయారు. భైంసా మండలంలోని చింతలబోరి గ్రామానికి చెందిన ఎన్.నగేష్ (27) నిర్మల్ సెంటర్‌లో టెట్ పరీక్ష రాసిన అనంతరం తన ద్విచక్ర వాహనంపై నిర్మల్ నుండి స్వగ్రామమైన చింతలబోరి గ్రామానికి వెళ్తుండగా భైంసా నుండి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇందులో నగేష్ ప్రమాద స్థలిలోనే దుర్మరణం పాలయ్యాడు. మృతునికి భార్యతోపాటు ఒక సంవత్సరం వయస్సు గల కూతురు ఉంది. దిలావర్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
27న టెట్ ఫలితాలు
RELATED ARTICLES