మృతుల్లో ఇద్దరు స్టాఫ్ నర్సులు
బరూచ్: కొవిడ్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలకు తెరపడడం లేదు. తాజాగా గుజరాత్‌లోని బరూచ్ కొవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం 18 మందిని బలి తీసుకుందని ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడడంతో, వారిని ఇతర ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీనితో మృ తుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బరూచ్‌లోని పటేల్ వెల్ఫేర్ కొవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు స్టాఫ్ నర్సులు సహా మొత్తం 18 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 మంది రోగులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసియులో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. విపరీతమైన పొగ వ్యాపించడంతో, కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో జరిగిందని అధికారులు అంటున్నారు. ఉదయం సుమారు 6.30 గంటలకు స్థానికులు, అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చి, ఇతర రోగులను వేరే ఆసుపత్రులకు తరలించారు. ఈ సంఘటనలో 16 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు వైద్య సేవలు పొందుతూ మృతి చెందారని బరూచ్ ఎస్‌పిరాజేంద్రసింగ చూడసామ తెలిపారు. కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న వారిలో మరో ఆరుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వారు కూడా సజీవ దహనమై ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, దర్యాప్తు తర్వాతే వివరాలు తెలుస్తాయని చూడసామ అన్నారు. అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయన్న అనుమానం వ్యక్తం చేశారు. కాగా, బరూచ్ కొవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధికారులను ఆదేశించారు.
ఆక్సిజన్ అందక ఎపి, ఢిల్లీలో
14 మంది మృతి
కర్నూలు/ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు మృత్యువాత పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ఆసుపత్రిలో ఆరుగురు, ఢిల్లీలోని బత్రా హాస్పిటల్‌లో ఎనిమిది చొప్పు న మొత్తం 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం కర్నూలు కెఎస్ కేర్ ఆస్పత్రి లో ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగు లు మరణించారు. తమకు ఆక్సిజన్ అందడం రోగులు వాపోతున్నా ఆసుపత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. కాగా, ఈ ఆసుపత్రికి కరోనా చికిత్సకు ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ, కరోనా చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్ అందక ఆరుగురు మరణించారన్న సమాచారం తెలుసుకున్న పోలీస్‌లు ఆసుపత్రికి చేరగానే, అక్కడి సిబ్బంది పరారయ్యారు. హాస్పిటల్ ఎండిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొదట్లో కేవలం ఐసోలేషన్లో ఉన్న వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. తరువాత కొవిడ్ చికిత్స జరుపుతున్నారనే విషయం బటయపడిందిఇలావుంటే, దేశరాజధానిలోని బత్రా ఆసుపత్రిలో ఓ వైద్యుడుసహా ఎనిమిది మంది ఆక్సిజన్ అందక మరణించారు. హాస్పిటల్‌లో శనివారం ఉదయం 11.45 గంటలకే ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయి. అప్పటికే ప్రాణవాయువు కోసం ప్రభుత్వానికి అత్యసవర సందేశాన్ని పంపింది. ప్రాణవాయువు సరఫరా మరో గంటలో వస్తుందనగా గ్యాస్ట్రో ఎంటరాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ ఆర్కే హిమథాని, మరో ఏడుగురు రోగులు మరణించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చిందని, అప్పటికే ఎనిమిది మంది మరణించారని ఆసుపత్రి వర్గాలు హైకోర్టుకు తెలిపాయి.
సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లు..
కరోనా పరిస్థితుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని పెద్ద ఆసుపత్రులు తగిన గుణపాఠం నేర్చుకోవాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ ఆసుపత్రులలో కరోనా పరిస్థితులు, బెడ్లు, ఆక్సిజన్ కొరతకు సంబంధించి పలు ఆసుపత్రులు దాఖలు చేసిన పిటిషన్లపై శనివారం విచారణ జరిపిన జస్టిస్ విపిన్ సంఘి, రేఖ పల్లితో కూడిన ధర్మాసనం ఎంతో అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్లను పెద్దపెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోకపోవడాన్ని తప్పు పట్టింది. ఇది బాధ్యతారాహిత్యమని విమర్శించింది. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని వీటిని వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
RELATED ARTICLES