ఫెర్రీ ఘాట్ వద్ద ఘటన
ఢాకా : ఇసుక రవాణా చేస్తున్న ఓడను ఒక స్పీడ్ బోట్ ఢీకొన్న ఘటనలో కనీసం 26 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్‌లోని షిబ్మార్ పట్టణానికి సమీపంలోని నర్మ నది వద్ద బంగ్లాబజార్ ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన ఈ సంఘటనపై అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సామర్థ్యాన్ని మించి ప్రయాణికులతో కూడిన స్పీడ్ బోట్‌ను, ఏ మాత్రం అనుభవం లేని ఒక కుర్రాడు నడిపాడు. అత్యంత వేగంగా వెళుతున్న ఈ స్పీట్ బోట్ ఒక ఇసుక సరఫరా ఓడను ఢీకొని ముగినిపోయింది. ఈ సంఘటనలో ఎంత మంది మృతి చెందారన్నది ఇంకా నిర్ధారణ కాలేదని, అయితే, ఇంత వరకు 26 మృత దేహాలను సహాయక సిబ్బంది బయటకు తీసుకొచ్చారని స్థానిక పోలీస్ చీఫ్ మిరాజ్ హుస్సేన్ తెలిపారు. ఐదుగురిని రక్షించగలిగారని అన్నారు. ఎంత మంది గల్లంతయ్యారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. కాగా, ఓడను పడవ ఢీకొనడానికి గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మునిసిపోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారుగానీ, అప్పటికే 26 మంది మృతి చెందారు. గల్లంతైన మిగతా వారి కోసం అధికారులు గాలింపు చర్య లు చేపట్టారు. పేలవమైన నిర్వహణ, షిప్ యార్డుల వద్ద భద్రతా ప్రమాణాల లేమి, విపరీతమైన రద్దీ వంటి అంశాలు ప్రమాదాలకు కారణమని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనూ సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవను పెద్ద కార్గో ఓడ ఢీకొట్టింది. గతేడాది జూన్లో ఫెర్రీ మునిగిపోయి 32 మంది మరణించారు. 2015 ఫిబ్రవరిలో కార్గో బోటును ఢీకొట్టడంతో కనీసం 78 మంది మరణించారు. నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
26 మంది దుర్మరణం బంగ్లాబజార్
RELATED ARTICLES