ప్రజాపక్షం / హైదరాబాద్: తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహ స్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి.హరీశ్ రావు, ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 18న ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహిస్తారు. ప్రగతి భవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మం త్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ ప్రగతి నిర్వహణపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని ఆకాంక్షించారు. పట్టణాల్లో పచ్చదనం- పారిశుధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని, పౌరులకు మెరుగైన సేవలు అందాలని, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని సిఎం పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ఆయా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి? అనేది ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని క్రమపద్ధతిలో ప్రగతి సాధించాలని చెప్పారు.
24 నుంచి పట్టణ ప్రగతి
RELATED ARTICLES