ధాన్యం కొనుగోలుపై ఒకేవిధానం లేకపోతే రోడ్లపైకి అన్నదాతలు
కేంద్రంపై పోరుకు తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధం
ఢిల్లీలో టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల నిరసన దీక్షలో సిఎం కెసిఆర్
పీయూష్ గోయల్ కాదు… పీయూష్ గోల్‌మాల్ అని వ్యాఖ్య
ప్రజాపక్షం/హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వంపైన పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపైన ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగితే సిబిఐ, ఈడి లాంటి సంస్థలతో దాడులు చేస్తారని, బిజెపిలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా?, వారి వద్దకు ఈడి, సిబిఐ వెళ్లదని, ప్రతి రాష్ర్టంలో ఇతర పార్టీల నాయకులను బిజెపి బెదిరిస్తుందని విమర్శించారు. తనను జైలుకు పంపుతామని తెలంగాణ రాష్ర్ట బిజెపి నేతలు అంటున్నారని, దమ్ముంటే పంపాలని, ఊరికే మొరగడం సరికాదని తెలిపారు. ప్రధానిమోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని, తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతుల పక్షాన ఢిల్లీలో సోమవారం “టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల నిరసనదీక్ష” నిర్వహించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేశ్ టికాయత్ ఈ దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా
సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారని, ఆయనకు రైతులపై ఏమైనా అవగాహన ఉన్నదా అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారని, తమ రైతులను, మంత్రులను అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలను నూకలు తినాలని చెప్పారని, తాము గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా?, ఆయన పీయూష్ గోయల్ కాదని, పీయూష్ గోల్ మాల్ అని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే ప్రభుత్వంతో ఆ పాలసీని రూపొందిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి ధనం కావాలి, లేదా ఓట్లు కావాలని, ధాన్యం మాత్రం వద్దని అన్నారు. రైతుల సంక్షేమం కోసం జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్‌తో కలిసి పని చేస్తామని, తెలంగాణ ప్రజానీకం టికాయత్ వెంట ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి అన్నం పెట్టే రాష్ర్టంగా తెలంగాణ అవతరిస్తే ప్రశంసించాల్సిన కేంద్రం, అవమానిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం పంట మార్పిడి చేయాలన్న విషయాన్ని తాము రైతులకు చెబితే బిజెపి రాష్ట్ర నేతలు మాత్రం వరి వేయాలని రైతులను రెచ్చగొట్టారన్నారు. రైతులు ధాన్యం పండించాలని, తాము కొంటామని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోతలు మొదలైన నాటి నుండి పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. తాము ఢిల్లీలో ధర్నా చేస్తే, తమకు పోటీగా బిజెపి నేతలు హైదరాబాద్‌లో నిరసన చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఉద్దేశంతో బిజెపి నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. బిజెపి నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. రైతుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
రైతులను అవమనించిన ఏ ప్రభుత్వం నిలువలేదు
తెలంగాణ నుంచి సుమారు 2 వేలకిలోమీటర్ల దూరం వచ్చి దీక్ష చేస్తున్నామని, ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరని కెసిఆర్ ప్రశ్నించారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడొద్దని, ప్రభుత్వంలో ఎవ్వరూ శాశ్వతంగా ఉండరన్నారు. ప్రజలను, రైతులను అవమానించిన ఏ ప్రభుత్వం కూడా నిలిచినట్లు చరిత్రలో లేదని, హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులే కాలగర్భంలో కలిసిపోయారని, ఇక మోడీ, అమిత్‌షా, పీయూష్ గోయాల్ ఎంత అని అన్నారు. పీయూష్ గోయల్ పారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, మోడీకి రైతుల కోసం ఖర్చు పెట్టేందుకు పైసలు లేవా?, మనసు లేదా?, దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదని, బిజెపి నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బోర్లకు మీటర్లు పెట్టుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తున్నదన్నారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ రైతులతో పడొద్దని హితవు పలికారు.
కెసిఆర్‌ది రాజకీయం కాదు.. రైతు ఉద్యమం
అవసరమైతే తెలంగాణకూ వస్తాం : రాకేశ్ టికాయత్
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో తెలంగాణ సిఎం కెసిఆర్ చేస్తున్నది రాజకీయం కాదని, రైతు ఉద్యమం అని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ధాన్యం కొనుగోలుచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడటం కేంద్రానికి సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, లేదంటే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుల తరపున కెసిఆర్ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, అవసర మైతే తాము తెలంగాణకు కూడా వచ్చి పోరాటం చేస్తామని తెలిపారు. దేశంలో రైతులు మరణిస్తుంటే, కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకోకుండా కళ్లప్పగించి చూస్తోందని ఆరోపించారు. రైతుల కోసం మమతాబెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారని, రైతుల కోసం ఎవ్వరు పోరాటం చేసినా వారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ.6 వేలు ఇస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతోందని అన్నారు. కనీస మద్దతు ధర అంశంలో ఏర్పాటైన కమిటీతో తాము చర్చలు జరిపామని,కాల వ్యవధిపై స్పష్టత ఇచ్చేందుకు ఆ కమిటీ నిరాకరించిందని టికాయత్ తెలిపారు. రైతుల కోసం తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు చాలా గొప్పవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్‌ను దేశ వ్యాపితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విపక్ష ముఖ్యమంత్రులందరూ ఏకమై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పి తీరుతాం: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రైతులను అవమానించిన కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పి తీరతామని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదన్నారు. ప్రజల మనసెరిగి పాలిస్తేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుందని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వాన్ని, ప్రజలను కేంద్రం ఢిల్లీకి రప్పించిందని, ప్రజలను కేంద్రం ఎంత కాలం మోసం చేయగలుగుతుందని ప్రశ్నించారు. దీక్షా వేదికపైన టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. అంతకుముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణం వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాలకు సిఎం కెసిఆర్ నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లికి పుష్పాలు సమర్పించారు.