24 నుంచి మినీ మేడారం

పైసా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం
భక్తుల సౌకర్యాలపై నిర్లక్ష్య ధోరణి
రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్‌ ప్రకటన
ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని అధికారులు, సిబ్బంది, భక్తుల ఆవేదన
ప్రజాపక్షం / వరంగల్‌ బ్యూరో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మేడారం మినీ జాతర ఈ నెల 24 నుండి నాలుగు రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే జాతరకు వేలాది మంది భక్తులు ప్రతిరోజూ తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ పూజారులు సైతం జాతరకు ముందు జరిగే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రతి రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహా జాతర గత ఏడాది ఘనంగా ఘనంగా జరిగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర జరిగిన ఏడాదికి మినీ మేడారం జాతరను నిర్వహించడంసాంప్రదాయం. మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తుండగా ఈ మినీ జాతరకు దాదాపు 20 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. కాగా మేడారం జాతరకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం ఈ మినీ జాతరకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మహాజాతర తర్వాత వచ్చే ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి రోజు మినీ జాతరను గిరిజన పూజారులు వైభవంగా నిర్వహిస్తున్నారు. వనం నుంచి దేవతలు గద్దెలపైకి రానప్పటికీ పూజలు మాత్రం మహాజాతర తరహాలోనే నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్దె రాజు, గోవిందరాజులు గద్దెల వద్ద కూడా పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది మేడారం వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో మినీ జాతరకు ఈ నెల మొదటి వారం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారంలో మొక్కులు తీర్పుకునేందుకు బారులు తీరుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు మినీ జాతరకు నిధులు కేటాయించకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మహాజాతరకు రూ.85 కోట్లు … మినీ జాతరకు రూ.2 కోట్లు
గత మహాజాతరకు ప్రభుత్వం రూ.85 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయగా మినీ జాతరకు ఇప్పటికీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా నిధులను కూడా కేటాయించకపోవడంతో జాతర నిర్వహణాధికారులు, సిబ్బందితో పాటు భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా మినీ జాతరకు రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య ప్రకటించారు. ఆ నిధులు దేనికి ఖర్చు చేస్తారో, ఏ శాఖకు సంబంధించినవో కూడా వివరించలేదు. మూడు రోజుల్లో జాతర ప్రారంభం కానుండడంతో కలెక్టర్‌ కేటాయించే నిధులు ఏ మూలకు కూడా సరిపోవని అధికారులు అంటున్నారు.
సదుపాయాల లేమి
గత ఏడాది మేడారం మహాజాతర కోసం చేపట్టిన పనులన్నీ ప్రస్తుతం నామరూపాలు లేకుండా పోయాయి. రోడ్లు, నీటి సరఫరా పైపులు, నల్లాలు, మరుగుదొడ్లు, బోర్లు, క్యూలైన్లు అన్నీ కూడా తాత్కాలిక ప్రాతిపాదికనే చేపట్టారు. ప్రస్తుతం మళ్లీ వాటిని పునరుద్ధరించేందుకు నిధుల అవసరం ఏర్పడింది. పలు చోట్ల శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన మరుగుదొడ్లు కూడా శిథిలమయ్యాయి. మరమ్మతులు చేస్తే 200 మరుగుదొడ్ల వరకు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉండగా, వాటికి కూడా నిధుల సమస్య ఏర్పడింది. ఇక మట్టి రోడ్లయితే వాటి రూపురేఖలనే కోల్పోయాయి.ఈ నేపథ్యంలో మినీ మేడారం జాతరకు సమయం సమీస్తుండటంతో అధికారులు ఏర్పాట్లకు రంగంలోకి దిగకపోవటంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీరు, మరుగుదొడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం, భక్తులు బస చేసే షెడ్లలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. జాతరలో కీలకమైన పారిశుధ్యం కోసం భారీగా నిధులు అవసరమంది. ఆర్‌టిసి, పోలీసు శాఖలకు కూడా ప్రత్యేకంగా నిధుల అవసరముంది. మొత్తంగా కనీసం రూ.20 కోట్ల నిధులైనా కేటాయిస్తే భక్తులకు సౌకర్యాలు సమకూరుతాయనే అభిప్రాయం అధికారులలో వ్యక్తమవుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?