28 శాతం శ్లాబులో ఇక 28 వస్తువులే
రేట్లు తగ్గనున్న సినిమా టిక్కెట్లు, టీవీలు, స్క్రీన్‌లు, కూరగాయలు
న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్నును(జిఎస్‌టి)ని కేంద్ర ప్రభుత్వం కాస్త సరళతరం చేసింది. దాదాపు 40 రకాల వస్తువులపై పన్ను తగ్గింపు ప్రభావం పడగా, ముఖ్యంగా 23 వస్తువులు, సేవలపై రేట్లను గణనీయంగా తగ్గించింది. 28 శాతం శ్లాబ్‌ను కుదించింది. చివరకు 28 శాతం పన్ను జాబితాలో కేవలం 28 వస్తువులే మిగిలాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతత్వంలో జరిగిన జిఎస్‌టి మండలి 31వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని హడావిడిగా జైట్లీ బృందం ఈ జిఎస్‌టి రేట్లను సవరించింది. ఇప్పటికే జిఎస్‌టితో సామాన్యునికి బతుకు దుర్భరమైన విషయం తెల్సిందే. తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మార్పులు అనివార్యంగా ప్రభుత్వం భావించింది. మోడీ తన పాలనాకాలంలో తీసుకున్న రెండు కీలకమైన నిర్ణయాలు నోట్ల రద్దు, జిఎస్‌టిలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన విషయం తెల్సిందే. దీని ఫలితం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కూడా పడింది. ఈ నేపథ్యంలో జిఎస్‌టికి సవరణలు చేసింది. తాజా సవరణల కారణంగా సినిమా టిక్కెట్లు, టీవీలు, మోనిటర్ స్క్రీన్‌లు, పవర్ బ్యాంకులు, నిల్వ ఉంచదగిన కూరగాయలు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి. అలాగే, పుల్లేలు, ట్రాన్స్‌మిషన్ షాఫ్ట్‌లు, క్రాంక్స్, గేర్‌బాక్సులు, ఉపయోగించిన టైర్లు, లిథియం ఇయాన్ బ్యాటరీలు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, వీడియో గేమ్ కన్సోల్స్ ధరలు కూడా కొంతమేరకు తగ్గుతాయి. ఇవన్నీ 28 శాతం శ్లాబ్ నుంచి 18 శాతం శ్లాబ్‌లోకి మారాయి. ఇక 28 శాతం శ్లాబులోకి ప్రస్తుతం సిమెంట్, ఆటోపార్ట్‌లు, ఇతర లగ్జరీ వస్తువులు వున్నాయి. ఈ కొత్త రేట్లు 2019 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.